ట్రాన్స్జెండర్ రక్తదానం చేయకూడదా.. ఆ బ్లడ్ బ్యాంక్ ఎందుకు బ్యాన్ చేసింది..?

ట్రాన్స్జెండర్ రక్తదానం చేయకూడదా.. ఆ బ్లడ్ బ్యాంక్ ఎందుకు బ్యాన్ చేసింది..?

కోల్కతాలో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. ప్రాణం కాపాడేందుకు రక్తదానం చేసేందుకు వచ్చిన ట్రాన్స్జెండర్ను నిరాకరించారు. బన్ హుగ్లీలో బ్లడ్ ఇచ్చేందుకు రక్తదాన శిబిరానికి వచ్చిన ఓ ట్రాన్స్ జెండర్ ను అక్కడి హెల్త్ వర్కర్లు అడ్డుకున్నారు. హెచ్ఐవీ వచ్చే ప్రమాదం ఉన్నందున ట్రాన్స్ జెండర్ రక్తదానం చేసేందుకు అనుమతించలేదని తెలుస్తోంది. అయితే కొన్ని వాదనల తర్వాత బ్లడ్ డునేట్ చేసేందుకు అనుమతించినా.. మొదట రక్త దానం చేయకుండా ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందనే అంశం చర్చనీయాంశమైంది. 

ఈ ఘటనను అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (APDR) ప్రధాన కార్యదర్శి రంజిత్ సూర్ ఖండించారు. ఇలాంటి వాటిని మేం సహించమని స్పష్టం చేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. లింగ మార్పిడి చేసుకున్నవారు, స్వలింగ సంపర్కులు(లెస్బియన్లు) రక్తదానం చేసేందుకు అర్హులు కారని నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కౌన్సిల్‌లో మార్గదర్శకం ఉన్నప్పటికీ దీని వెనుక కారణం స్పష్టంగా పేర్కొనబడలేదని స్పష్టం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొంటున్న చాలామందికి దీనిపై అవగాహన లేదన్నారు. నైతిక ప్రాతిపదికన పరిగణలోని తీసుకుంటే రక్తదానం చేయకుండా అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన అని రంజిత్ సూర్ స్పష్టం చేశారు.