ముషీరాబాద్, వెలుగు: సాధారణ ప్రజలకు ఉన్న హక్కులను తమకూ కల్పించాలని కోరుతూ స్వాభిమాన యాత్ర పేరిట ట్రాన్స్ జెండర్లు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ హిజ్రా ట్రాన్స్ జెండర్ సమితి, సురక్ష, స్టార్, మోంబేర ఇతర సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు చంద్రముఖి మువ్వాల, అనిల్, చిన్నికృష్ణ వైజయంతి హర్షిణి తదితరులు మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో ట్రాన్స్‌జెండర్లపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, తమకూ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఏపీలో పెన్షన్ ఇస్తున్నారని, ఇక్కడ కూడా పెన్షన్స్, ఇండ్లు, రేషన్ కార్డు ఇవ్వాలని కోరారు.
