పెట్రోల్, డీజిల్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంచాలి..రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా శాఖ నివేదిక

పెట్రోల్, డీజిల్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంచాలి..రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా శాఖ నివేదిక

హైదరాబాద్, వెలుగు: ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ వాహనాలపై లైఫ్ ట్యాక్స్​ తక్కువగా ఉందని రవాణా శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.  దీనిపై కేబినెట్ ​భేటీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉండనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా శాఖలోని ఉన్నతాధికారులు పలు రాష్ట్రాల్లో లైఫ్ ట్యాక్స్ అమలు చేస్తున్న తీరుపై స్టడీ చేసి వచ్చారు.

ఇందులో ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. తెలంగాణలో రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో 60 శాతం నుంచి 70 శాతం ఈ లైఫ్ ట్యాక్స్ ద్వారానే ఉంటుంది. అందుకే ఈ శాఖ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ లైఫ్ ట్యాక్స్ ను పెంచనుంది. ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ ను పెంచితే కనీసం రూ.2 వేల కోట్ల ఆదాయం అదనంగా వస్తుందనే ప్రభుత్వం అంచనా వేస్తున్నది.

మన రాష్ట్రంలోనే తక్కువ 

కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లైఫ్ ట్యాక్స్ తప్పనిసరి. ఈ ట్యాక్స్ మొత్తాన్ని ఆ వాహనం ఖరీదులోనే కలిపేస్తారు.15 ఏండ్ల పాటు రోడ్లపై వాహనం తిరిగేందుకు రవాణా శాఖ ఇచ్చే అనుమతియే రోడ్ ట్యాక్స్ లేదా లైఫ్ ట్యాక్స్. అయితే ఇది వ్యక్తిగతంగా కొనుగోలు చేసే టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ట్రాన్స్‌‌‌‌పోర్టుకు సంబంధించిన వెహికల్స్ కు మాత్రం 15 ఏళ్లకు ఒకేసారి కాకుండా స్లాబ్ ల చొప్పున కొంత వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రంలో టూ వీలర్లకు రెండు రకాల స్లాబ్ లు ఉన్నాయి.

అవి రూ.50 వేల లోపు ఖరీదు చేసే టూ వీలర్లకు 9 శాతం లైఫ్ ట్యాక్స్, ఆపై ఖరీదు చేసే టూ వీలర్లకు 12 శాతం లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే కర్నాటకలో 18 శాతం, కేరళలో 20 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ విధిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో ఫోర్ వీలర్లకు నాలుగు రకాల స్లాబ్ లు ఉన్నాయి. అవి 13, 14, 17, 18 శాతం స్లాబ్ లు..  రూ.5 లక్షల లోపు ఖరీదు చేసే ఫోర్ వీలర్లకు13 శాతం లైఫ్ ట్యాక్స్, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఖరీదు చేసే ఫోర్ వీలర్లకు 14 శాతం, రూ.10 నుంచి రూ.20 లక్షల మధ్య ఖరీదు చేసే వాటికి17 శాతం లైఫ్ ట్యాక్స్ విధిస్తున్నారు.

ఇక రూ.20 లక్షల పైనుంచి ఆపై ఖరీదు చేసే ఫోర్ వీలర్లకు 18 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ వేస్తున్నారు. అదే కేరళ, తమిళనాడు, కర్నాటకలలోనైతే 20 శాతం నుంచి 21 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ లు  విధిస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణను ఫ్రీ పొల్యూషన్ స్టేట్ గా నిలపాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వాటికి లైఫ్ ట్యాక్స్ ను మినహాయింపు ఇచ్చారు.