మరిపెడ, వెలుగ: మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ క్యాంప్ ఆఫీస్లో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులకు మొత్తం కాంగ్రెస్అభ్యర్థులను గెలిపించాలని పార్టీ నాయకులకు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మంత్రి మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కిందని, కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అనేక హామీలను నెరవేర్చిందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మున్సిపల్ ఎన్నికల్లోనూ స్థానికంగా ఇదే నిష్పత్తిలో టికెట్లు కేటాయించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నిలదీయాలని కోరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళీనాయక్, జిల్లా నాయకులు వంటికొమ్ము యుగేందర్ రెడ్డి, మరిపెడ మండలాధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, టౌన్ అధ్యక్షుడు తాజుద్దీన్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు గూగులోతు రవి నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.
