
వేములవాడ, వెలుగు : బీసీల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్న ఆయన ముందు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎల్పీ శాసనసభపక్ష నేత పదవులు బీసీ, ఎస్సీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కుటుంబసమేతంగా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కుటుంబ, రాజరిక పాలన సాగించిన కేటీఆర్ కు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు.
బీసీల లెక్క తెలియకపోవడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతున్నాయని, బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. కుటుంబ సర్వేపై బీజేపీ, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అప్రతిష్టపాలు చేస్తున్నాయని, ప్రజలు గమనించాలని కోరారు. సర్వేలో పాన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్స్వివరాలు అడగడం లేదన్నారు. ఎన్యుమరేటర్లను ఇబ్బంది పెడితే ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ లో మాట్లాడే స్వేచ్ఛ లేదని, బావ, బామ్మర్దులే పోటీ పడుతున్నారన్నారు.
దేశంలో రాముడి పేరు చెప్పి ఓట్లు అడగవచ్చుగాని అసమానతలు తొలగించి ఒక ప్రణాళికతో అభివృద్ధి కోసం వివరాలు అడగవద్దా అని బీజేపీని మంత్రి ప్రశ్నించారు. తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే భయంతో కొందరు సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి ఆలయానికి చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్, ఈఓ వినోద్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ ఉన్నారు.