ఆర్టీసీ జేఏసీ నేతలు కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. పండుగ వేళ ప్రయాణికులతో పాటు సామాన్య జనం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో సీఎం సమ్మె విరమించాలని హెచ్చరించారు. అయినా కూడా సమ్మె కొనసాగుతుండడంతో… కొత్త ఆర్టీసీ పాలసీని ప్రవేశపెట్టాలని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ కమిటీ తెలిపింది.
ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల ఆఫీస్ లో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో RTC లో కొత్త డ్రైవర్ లు, కండక్టర్ ల ఉద్యోగుల రిక్రూట్మెంట్ పై చర్చ జరుపుతున్నారు. 2500 అద్దె బస్సులు ఏర్పాటు, ప్రస్తుత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అనంతరం సోమవారం సాయంత్రం నాలుగు గంటల కు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈ కమిటీ భేటీ కానుంది.
సమావేశంలో సునీల్ శర్మ మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పోయినట్లేనన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు వారికి డెడ్ లైన్ ఇచ్చామని, ఇక డెడ్ లైన్ లు లేవని అన్నారు. ఇప్పుడు కార్మికులు చేరుతామన్న తీసుకోమని తెలిపారు.
సమ్మె కొనసాగిస్తున్న ప్రస్తుత RTC కార్మికులంతా మాజీ కార్మికులేనని సునీల్ శర్మ అన్నారు. సమ్మె నోటీస్ ఇవ్వడం, సమ్మె కు వెళ్లడం కూడా తప్పేనన్నారు. వాళ్ళు న్యాయ స్థానాలను ఆశ్రయించిన కూడా లాభం లేదని, గత తీర్పులు సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ బస్సులు సుమారు 8 వేల వరకు ఉన్నాయని., ఇందులో 2 వేలకు పైగా స్క్రాప్ కింద పడేస్తామని ఆయన చెప్పారు. ప్రవేట్ RTC బస్సులను తీసుకొచ్చి, వాటికి స్టేట్ క్యారియర్ పర్మిట్ లు ఇస్తామని సునీల్ శర్మ తెలిపారు.
