సీఎం కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది

సీఎం కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టంగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నిర్వహించనున్న సభ భయం పట్టుకుందని అన్నారు. సీఎంను ఫాంహౌస్ నుంచి బయటకు తీసుకురావడంతోనే బీజేపీ నైతికంగా విజయం సాధించిందని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్న సందర్భంగా రేపు మునుగోడులో నిర్వహిస్తున్న మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేయాలని తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకానున్న ఈ సభకు ప్రజలు, ముఖ్యమంగా యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వ 8ఏండ్ల దుష్టపాలనపై జనం ఆగ్రహంతో ఉన్నారని తరుణ్ చుగ్ చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి, నిరంకుశ పాలనను సమాధి చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ చేస్తున్న ద్రోహాన్ని ఎదురించాలన్న ప్రజల సంకల్పానికి బీజేపీ అండగా నిలుస్తుందని చుగ్ హామీ ఇచ్చారు. అన్నివర్గాలకు ముప్పుగా మారిన కుటుంబపాలనకు చరమగీతం పాడాలని బీజేపీ సంకల్పించిందని చుగ్ స్పష్టం చేశారు.