హైవే కోసం చెట్లు నరుకుతున్రు.. పట్టంచుకోని ఆఫీసర్లు

హైవే కోసం చెట్లు నరుకుతున్రు..  పట్టంచుకోని ఆఫీసర్లు

కరీంనగర్ – వరంగల్ ​ఫోర్​ లేన్  ​కోసం వందలాది చెట్లు నేలమట్టం

  • ట్రీ ట్రాన్స్ లొకేషన్ గురించి పట్టంచుకోని ఆఫీసర్లు
  • హైవేలో పచ్చదనం కనుమరుగు
  • ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ప్రకృతి ప్రేమికులు 

కరీంనగర్, వెలుగు : రెండు వైపులా పెద్దపెద్ద చెట్లతో పచ్చదనంతో ఎప్పుడూ ఆహ్లాదరకంగా కనిపించే కరీంనగర్‌‌‌‌‌‌‌‌–వరంగల్ హైవే బోసిపోతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా వేలాది చెట్లను నేలకూలుస్తున్నారు. దీంతో రోడ్డు వెంట నీడనిచ్చే చెట్లు కరువైపోతున్నాయని వాహనదారులు, పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు హరితహారం పేరిట మొక్కలు నాటడం, సంరక్షణకు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ట్రీ ట్రాన్స్ లొకేషన్ పై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రోడ్డు పొడవునా వేలాది చెట్ల నరికివేత..

కరీంనగర్–- వరంగల్ వరకు రూ.2,146 కోట్లతో 68 కిలోమీటర్ల మేర ఫోర్​లైన్​విస్తరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రోడ్డుపై ఐదారు దశాబ్దాల నాటి మర్రి, వేప, ఇతర జాతులకు చెందిన భారీ చెట్లు ఉన్నాయి. రోడ్డు నిర్మాణం కోసం ఇప్పటికే సుమారు 300 చెట్లు నరికేశారు. సుమారు మరో 2 వేల చెట్లు నేలకూల్చే పరిస్థితి కనిపిస్తోంది. తొమ్మిదేళ్లలో హరితహారంలో నాటిన  చిన్నాచితక చెట్లకు లెక్కేలేదు. 50 ఏళ్ల కింద నాటినవి నేడు భారీ వృక్షాలుగా మారాయి. వీటిని ట్రీ ట్రాన్స్ లోకేషన్ పద్ధతిలో సమీపంలోనే మళ్లీ నాటే అవకాశం ఉన్నా ఖర్చు నెపంతో ఈ విషయం పట్టించుకోవడం లేదు.  దీంతో కరీంనగర్‌‌‌‌‌‌‌‌–వరంగల్​హైవేపై పచ్చదనం కనుమరుగవుతోంది.