వణికిస్తున్నసీజనల్​ ఫీవర్స్​.. హాస్పిటళ్లకు క్యూడుతున్న జనాలు

వణికిస్తున్నసీజనల్​ ఫీవర్స్​.. హాస్పిటళ్లకు క్యూడుతున్న జనాలు
  • ఒక్కసారిగా పడిపోయిన టెంపరేచర్.. చలి తీవ్రతతో పెరుగుతున్న బాధితులు

హైదరాబాద్​, వెలుగు: సిటీలోని ​జనాలను సీజనల్​ ఫీవర్స్ ​వణికిస్తున్నాయి. పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రధానంగా జ్వరం, న్యూమోనియా, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులతో బాధపడుతూ డాక్టర్ల వద్దకు వెళ్తున్నారు. సీరియస్ అయినవారు వెంటనే అడ్మిట్​అవుతున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులపై సీజనల్​ ఫీవర్ ఎఫెక్ట్ ఎక్కువగా చూపుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఫీవర్​త్వరగా తగ్గకపోవడంతో వచ్చిన వారే మళ్లీ వస్తున్నారని పేర్కొంటున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వైరల్​ ఫీవర్స్ ​కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం సిటీలో 15 డిగ్రీల సెల్సియస్​ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చుట్టూ వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు.  

పెరుగుతున్న కేసులు

ప్రధానంగా హాస్పిటల్స్​తో పాటు ప్రైవేట్ క్లినిక్స్​కు పేషెంట్లు భారీగా వెళ్తున్నారు. ఒక్కో క్లినిక్​కు రోజూ వందల సంఖ్యలో  వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.  సిటీలోని ప్రధాన హాస్పిటల్స్​అయిన గాంధీ, ఉస్మానియా, ఫీవర్​ హాస్పిటల్స్​లోనూ రద్దీ పెరిగింది. ఫీవర్​ హాస్పిటల్​లో బుధవారం 540 ఓపీ కేసులు నమోదు కాగా, మంగళవారం 491 వచ్చాయి. రోజు 20 మంది దాకా ఇన్​పేషెంట్స్ వస్తున్నారని డాక్టర్లు తెలుపుతున్నారు. వీరిలో ప్రధానంగా యువత, మిడిల్ ఏజ్ గ్రూప్ వారు ఉంటున్నారన్నారు.  ఫీవర్​ హాస్పిటల్​లో టైఫాయిడ్, గవదబిల్లల కేసులే ఎక్కువ నమోదవుతున్నాయి.  గవదబిల్లలు తగ్గడానికి సమయం పడుతుండటంతో ఇన్​పేషెంట్స్ సంఖ్య పెరుగుతుందంటున్నారు.  గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసులు తక్కువేనని ఫీవర్​ హాస్పిటల్​డాక్టర్లు పేర్కొంటున్నారు.

జాగ్రత్తగా ఉండాలి

ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో సీజనల్​ ఫీవర్స్ ​కేసులు పెరిగాయి. వందలో 80 కేసులు జ్వరాలకు సంబంధించినవే ఉంటున్నాయి. పిల్లలు, మహిళలు ఎక్కువగా వాటి బారిన పడుతున్నారు. ప్రధానంగా న్యూమోనియా, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. చలి తీవ్రత తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలి.
– విజయ భాస్కర్, కన్సల్టెంట్, హెలియోస్​ హాస్పిటల్