MLC 2025: బంతితో కాదు బ్యాట్‌తో కొట్టాడు.. బోల్ట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ వెనుక హార్దిక్ హస్తం

MLC 2025: బంతితో కాదు బ్యాట్‌తో కొట్టాడు.. బోల్ట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ వెనుక హార్దిక్ హస్తం

మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా వరల్డ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ మ్యాచ్ గెలిపించాడు. బోల్ట్ మ్యాచ్ గెలిపించడంలో ఆశ్చర్యం లేకపోయినా అతను బ్యాట్ తో చెలరేగి తమ జట్టుకు విజయాన్ని అందించడం విశేషం. మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా గురువారం (జూలై 10) ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఎంఐ న్యూయార్క్ తరపున ఆడుతున్న బోల్ట్.. లో స్కోరింగ్ థ్రిల్లర్ లో విజయాన్ని అందించాడు. ఎంఐ విజయానికి చివరి 3 ఓవర్లలో 24 పరుగులు అవసరం. అప్పటికే 8 వికెట్లు పడడంతో ఈ మ్యాచ్ లో ఎంఐ న్యూయార్క్ ఓటమి ఖాయమనుకున్నారు. 

ఇలాంటి కష్ట సమయంలో బోల్ట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎంఐ న్యూయార్క్  8 వికెట్లకు 108 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి 18 బంతుల్లో 24 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో బోల్ట్ హసన్ ఖాన్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఒక్కసారిగా ముంబై విజయానికి దగ్గరలో వచ్చింది. 13 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ముంబైని క్వాలిఫయర్ 2కు చేర్చాడు. మ్యాచ్ తర్వాత బోల్ట్ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. 

►ALSO READ | IND vs ENG 2025: బుమ్రాకు 5 వికెట్లు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ స్కోర్ ఎంతంటే..?

సూపర్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ గెలిపించిన బోల్ట్ బ్యాట్ మరెవరో కాదు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యది. ఈ సీజన్ ఐపీఎల్ ఆడుతుండగా హార్దిక్ పాండ్యా తన దగ్గర ఉన్న బ్యాట్ ను బోల్ట్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ బ్యాట్ తోనే ఈ కివీస్ పేసర్ చెలరేగి మ్యాచ్ గెలిపించడం విశేషం. బోల్ట్ బ్యాట్ కింద పాండ్య అని రాసి ఉంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.