ముగ్గురూ ముగ్గురే!..నాగర్​కర్నూల్​లో ట్రయాంగిల్​ వార్​

ముగ్గురూ ముగ్గురే!..నాగర్​కర్నూల్​లో ట్రయాంగిల్​ వార్​
  •     మూడోసారి గెలుపు కోసం మల్లు రవి ఆరాటం
  •     ‘మోదీ’ ఛరిష్మా, లోకల్​ కార్డు, తండ్రి బలాన్ని నమ్ముకున్న భరత్​
  •     సొంత జిల్లాపై మాజీ పోలీస్ బాస్ ఆర్ఎస్పీ నమ్మకం

నాగర్​కర్నూల్. వెలుగు: నాగర్​కర్నూల్ లోక్​సభ నుంచి పోటీకి మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్​నుంచి సీనియర్​ లీడర్​, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్​ దక్కించుకోగా, బీజేపీలో చేరిన సిట్టింగ్​ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు పోతుగంటి భరత్​ప్రసాద్​కు టికెట్​ఇప్పించుకోగలిగారు. బీఎస్పీ స్టేట్ చీఫ్​హోదాలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్​ఆర్.ఎస్.​ ప్రవీణ్​కుమార్​బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దీంతో నాగర్​కర్నూల్​లో అప్పుడే పార్లమెంట్​పోరు మొదలైంది. 

కాంగ్రెస్​కు కిక్​ఇచ్చిన అసెంబ్లీ లీడ్

నాగర్ కర్నూల్​పార్లమెంట్​పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఇందులో ఐదు స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్​గెలిచింది. కొల్లాపూర్​నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట నుంచి డీసీసీ ప్రెసిడెంట్​డా.వంశీకృష్ణతో పాటు కల్వకుర్తి, నాగర్​కర్నూల్, వనపర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ పట్టుసాధించింది. ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​6,39,628 ఓట్లు సాధించి 1,05,227 లీడ్​తో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే 5,34,401 ఓట్లు పొందిన బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంది.​ రెండు పార్టీల మధ్య దాదాపు 11 శాతం ఓట్ల తేడా ఉంది. అలంపూర్​, గద్వాల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన సంతోషం లేకుండా స్థానిక సంస్థల మెజార్టీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ పనితీరు, ఫలితాలతో దాదాపు లక్ష పై చిలుకు మెజార్టీ సాధించింది. అచ్చంపేట, కొల్లాపూర్​ నియోజకవర్గాల్లోనే దాదాపు 80వేల మెజార్టీ వచ్చింది. సీఎం రేవంత్ సొంత జిల్లా కావడం, మంత్రి జూపల్లికి ఇన్ చార్జి బాధ్యతలు ఇవ్వడం కూడా కాంగ్రెస్​కలిసొచ్చే అంశాలు. ఊపుమీదున్న కాంగ్రెస్​క్యాడర్​అసెంబ్లీ ఫలితాలు పునరావృతమవుతాయనే ధీమాతో ఉంది. ​కాంగ్రెస్​టికెట్​దక్కించుకునేందుకు మల్లు రవి, సంపత్​చివరి వరకు పోటీ పడ్డా హైకమాండ్​ మల్లు రవి వైపే మొగ్గు చూపింది. దీంతో ఆయన హైకమాండ్​కు గెలుపును బహుమతిగా ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. 2019 పార్లమెంట్​ఎన్నికల్లో మల్లు రవి ఓడిపోయినా 1991, 1998లో రెండు సార్లు ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. జడ్చర్ల అసెంబ్లీ నుంచి మూడు సార్లు పోటీ చేసినా నాగర్​కర్నూల్​పార్లమెంట్​నియోజకవర్గంలోని కాంగ్రెస్​నాయకులు, క్యాడర్​తో వ్యక్తిగత అనుబంధం కొనసాగించారు. బీఆర్ఎస్​అధికారంలో ఉన్న సమయంలో పీసీసీ చీఫ్​ రేవంత్​అచ్చంపేట నుంచి చేపట్టిన ఆకస్మిక పాదయాత్రను సమన్వయం చేశారు. నాగర్​కర్నూల్​, కొల్లాపూర్, వనపర్తి కాంగ్రెస్​ టికెట్ల పేచీ  పరిష్కారానికి రేవంత్​కు మల్లు కుడిభుజంగా నిలబడ్డారు. టికెట్​రేసులో చివరి వరకు పోటీపడిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ మెత్తబడడమే కాకుండా మల్లు గెలుపుకోసం పని చేస్తామని ప్రకటించడం అలంపూర్​, గద్వాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్​కు కలిసొస్తుందని భావిస్తున్నారు.

లోకల్ స్లోగన్, మోదీ హవాపై ఆశలు

రెండోసారి బీజేపీ టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని కాదని కొత్తగా పార్టీలో చేరిన భరత్​కు టికెట్​ఇచ్చిన బీజేపీ హైకమాండ్​ లోకల్​లీడర్స్​మాటకే ప్రియారిటీ ఇచ్చింది. దీంతో భరత్​ప్రసాద్​తాను స్థానికుడినని, సిట్టింగ్​ఎంపీ రాములు కొడుకుగా ఆశీర్వదించాలని ప్రచారం చేసుకుంటున్నారు. అచ్చంపేట నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఎంపీ పోతుగంటి రాములుకు నాగర్​కర్నూల్​జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి పరిచయాలున్నాయి. 2019 పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్​మధ్య పోరులో అప్పటి బీఆర్ఎస్​అభ్యర్థి అయిన రాములు 1,89,668 ఒట్ల మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్​హైకమాండ్​తిరస్కరించడంతో అవమానాలతో ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరడమే కాకుండా కొడుకుకు పార్టీ టికెట్​ ఇప్పించుకోగలిగారు. కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలతో ప్రత్యక్ష సంబంధాలున్న రాములు పాత బీఆర్ఎస్​ లీడర్ల మద్దతు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మల్లురవి స్థానికేతరుడనే నినాదం తెరపైకి తెస్తున్నారు. ప్రధాని మోదీ హవా ఆదుకుంటుందనే ధీమాతో ఉన్నారు. ఆయోధ్య రామ మందిర నిర్మాణం, మధ్యతరగతి వర్గాలు, స్టూడెంట్స్, యూత్, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు ఈసారి మోదీకి  మద్దతిస్తాయన్న ఆశతో ఉన్నారు. టికెట్​దక్కని పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని వ్యతిరేకిస్తున్న లోకల్​లీడర్స్​బ్యాచ్..​ప్రచారానికి ఆమెను దూరంగా ఉంచడం పార్టీకి ఎంతవరకు నష్టం కలిగిస్తుందనే దానిపై చర్చ జరుగుతోంది. జడ్చర్ల అసెంబ్లీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి చిత్తరంజన్​దాస్​ సైతం స్థానిక బీజేపీ నాయకత్వ వ్యవహరశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గద్వాల,అలంపూర్​ నియోజకవర్గాల్లో డీకే అరుణ పట్టు తమకు ప్లస్​అవుతుందని అంచనా వేసుకుంటున్నారు.

ఆర్ఎస్​పీకి  క్యాడర్ త​సహకరిస్తుందా?  

బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుల ప్రయోగం పురిట్లోనే తిరగబడి ‘ఏనుగు’ దిగిన ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​నాగర్​కర్నూల్​బీఆర్ఎస్​అభ్యర్థిగా రంగంలోకి రావడంతో మూడు బలమైన పార్టీల మధ్య పోరు అనివార్యమైంది. అలంపూర్​నియోజకవర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్​కు అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు అనుకూలమని భావిస్తున్నా అక్కడ కాంగ్రెస్, డీకే అరుణ ప్రభావం ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్​రిజల్ట్​తో నిరాశకు గురైన బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యేలు ఫలితాలపై ఇప్పటికి పోస్ట్​మార్టం చేసుకుంటున్నారు. అయినా పార్లమెంట్​ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్న దాఖలాలు కనిపించడం లేదనే టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలను ఆర్ఎస్​పీ ఎంత వరకు సమన్వయం చేసుకుంటారు? పార్టీ క్యాడర్​ఎంత వరకు సహకరిస్తుందనే దానిపైనే ఆయన గెలుపు ఆధారపడి ఉంటుంది. అయితే, కవిత అరెస్ట్​ఎపిసోడ్​ విపరీతంగా చర్చకు రావడం ఆ పార్టీ క్యాడర్​కు ఆందోళన కలిగిస్తోంది.