భద్రాచలంలో ఆదిలోనే ఆగిపోయిన ట్రైబల్​ ఆర్ట్స్​స్కూల్స్​

భద్రాచలంలో ఆదిలోనే ఆగిపోయిన ట్రైబల్​ ఆర్ట్స్​స్కూల్స్​

రాష్ట్ర సర్కారు తీరుతో ఆదిలోనే బ్రేక్​ 

భద్రాచలం, వెలుగు : అంతరించిపోతున్న ఆదివాసీల కళలకు జీవం పోయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేయాలనుకున్న ట్రైబల్​ఆర్ట్స్​స్కూల్స్​ఆదిలోనే ఆగిపోయాయి. ట్రైబల్ కల్చర్​రీసెర్చ్ అండ్​ట్రైబల్ ఇన్​స్టిట్యూట్​(టీసీఆర్​అండ్ టీఐ), ట్రైబల్​వెల్ఫేర్​డిపార్ట్​మెంట్లు సంయుక్తంగా రాష్ట్రంలోని ఐటీడీఏల పరిధిలో ట్రైబల్​ఆర్ట్స్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలనుకున్నాయి. ఆదివాసీ కళాకారులు గుస్సాడీ కనకరాజు, డోలీ సకినెం రామచంద్రయ్యలకు కేంద్రం పద్మశ్రీ అవార్డులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఆదివాసీ కళల పునరుద్ధరణకు ఈ నిర్ణయం తీసుకుంది. నేటి తరం గిరిజన యువతకు వారి సంప్రదాయ కళలను నేర్పించాలనేది ఈ ఆర్ట్స్ స్కూళ్ల లక్ష్యం. ఈ విద్యా సంవత్సరమే వీటిని తెరిచి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశాలు కూడా వచ్చాయి. కానీ బడ్జెట్​మాత్రం రిలీజ్ చేయలేదు. దీంతో రాష్ట్రంలోని ఉట్నూరు(అదిలాబాద్), భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం)లలో ఆర్ట్స్ స్కూళ్లు తెరిచి మూసేశారు. ఏటూరునాగారం(ములుగు)లో ఓపెన్​కూడా చేయలేదు.  

కాగితాల్లోనే అంతా...!

భద్రాచలంలో రేలా, డోలీ, కొమ్ముడ్యాన్స్ కళలపై ట్రైనింగ్​ ఇచ్చేందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత డోలీ కళాకారుడు సకినెం రామచంద్రయ్యను, ఉట్నూరులో గుస్సాడీ కళాకారుడు పద్మశ్రీ కనకరాజును, ఏటూరునాగారంలో కొమ్ము డ్యాన్స్ శిక్షణకు బీసా ముండాలను చీఫ్​ మాస్టర్లుగా నియమిస్తూ ట్రైబల్​వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి గౌరవ వేతనంగా రూ.20వేలు ఇస్తున్నట్లుగా ప్రకటించి, స్కూళ్ల ఏర్పాటు బాధ్యత లోకల్​ఐటీడీఏలకు అప్పగించింది. దీంతో ఐటీడీఏల్లో భవనం ఏర్పాటు, చీఫ్​ మాస్టర్లకు రూం, ఫర్నిచర్​తదితర మౌలిక సదుపాయాలు ఐటీడీఏలు కల్పించాయి. ఇంత వరకు అన్నీ సవ్యంగానే సాగాయి. జూన్​ నెల నుంచే ఈ స్కూళ్లు షురూ కావాలి. ఒక్కో స్కూలులో ఆయా కళలకు చెందిన 15 మంది కళాకారులతో ఐదేసి టీంలను ఏర్పాటు చేశారు. వీరు ఎంపిక చేసుకున్న ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి దశల వారీగా ట్రైనింగ్​ఇస్తారు. చీఫ్​ మాస్టర్​కు గౌరవ వేతనంతో పాటు, ఎంపిక చేసిన 15 మంది కళాకారులకు వేతనం, టీఏ,డీఏలు, ఇతర ట్రైనింగ్​ఖర్చులకు బడ్జెట్​ విషయంపై ట్రైబల్ వెల్ఫేర్​డిపార్ట్​మెంట్​నుంచి ఎలాంటి నిధులు రాలేదు. దీంతో ఉట్నూరులో ఒక నెల పాటు ట్రైనింగ్​ఇచ్చి తర్వాత ఆపేశారు. భద్రాచలం ఐటీడీఏలో కూడా ఇదే జరిగింది. భద్రాచలం ఐటీడీఏ నుంచి ట్రైబల్​ఆర్ట్స్ స్కూల్​నిర్వహణకు రూ.15లక్షలతో బడ్జెట్​ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇప్పటికీ పైసా విదల్చలేదు.  

బడ్జెట్ ప్రతిపాదనలు పంపినం

ట్రైబల్ ఆర్ట్స్ స్కూల్​కు ఐటీడీఏ నుంచి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించినం. బడ్జెట్ ఎస్టిమేషన్స్ వేసి పంపినం. కమిషనర్​ పరిశీలిస్తున్నరు. త్వరలోనే నిధులు వస్తాయనుకుంటున్నా. రాగానే స్టూడెంట్లకు ట్రైనింగ్​షురూ చేస్తం.

–  డేవిడ్​రాజ్​, ఏపీఓ జనరల్, 
ఐటీడీఏ, భద్రాచలం

చాలా దారుణం

ఆర్ట్స్ స్కూళ్లకు బడ్జెట్​ కేటాయించకపోవడం దారుణం. ఆదివాసీ కళలను కాపాడుతామని ప్రకటించడం కాదు అందుకు కావాల్సిన నిధులు ఇవ్వడం కూడా సర్కారుదే బాధ్యతే. ప్రభుత్వ నిర్వాకం వల్ల స్కూళ్లు మూతపడ్డాయి. వెంటనే నిధులు విడుదల చేయాలి.   

– దుర్గారెడ్డి, ఆదివాసీ కొండరెడ్ల సంఘం నాయకులు,భద్రాచలం