దాతల కోసం చూస్తున్న.. JEE ర్యాంకర్

దాతల కోసం చూస్తున్న.. JEE ర్యాంకర్

కాగజ్ నగర్, వెలుగు:  పొర్తేటి రజినీకాంత్ ది.. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికల్​పేట్​ మండలం కమ్మర్​గాం గ్రామం. జేఈఈ మెయిన్స్​లో మంచి ర్యాంకు సాధించడంతో నాగాలాండ్​లోని ఎన్ఐటీ(నేషనల్​ఇనిస్టిట్యూట్​ఆఫ్ టెక్నాలజీ)లో సీట్ వచ్చింది. నిరుపేద కుటుంబం కావడంతో కాలేజీ ఫీజుకు, అక్కడికి వెళ్లి చదువుకునేందుకు పైసలు లేక దాతల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆదివాసీలైన పొర్తేటి రమేశ్, రత్నాబాయి మూడో బిడ్డ రజినీకాంత్. బతుకుదెరువు కోసం కుటుంబమంతా ఊరి నుంచి వలస వెళ్లి కరీంనగర్ వద్ద ఉన్న ఓ కోళ్ల ఫాంలో పనిచేస్తుండగా.. రజినీకాంత్ ఖమ్మంలోని ట్రైబల్ వెల్ఫేర్​స్కూల్​లో ఇంటర్​ మీడియట్ ​పూర్తిచేశాడు. బాలుడి తండ్రి రమేశ్​2019లో కరోనాతో చనిపోయాడు. దాంతో కుటుంబ భారం మొత్తం తల్లి రత్నాబాయి మీద పడింది. అమ్మకు తోడుగా కోళ్లఫాంలో పనిచేస్తూనే రజినీకాంత్​ జేఈఈ మెయిన్స్​రాసి స్టేట్​ లెవల్​లో 5,232 ర్యాంకు సాధించాడు. ఎస్టీ కోటాలో నాగాలాండ్​లోని ‌‌ఎన్​ఐటీలో సీటు(ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్​స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) వచ్చింది. అక్కడికి వెళ్లి చదువుకోవాలంటే ఏడాదికి దాదాపు లక్ష వరకు ఖర్చు అవుతుంది. తన తల్లికి అంత పెట్టి చదివించే స్థోమత లేదని, దాతలు, ప్రభుత్వం సాయం చేయాలని రజినీకాంత్ కోరుతున్నాడు.