
అదృష్టమంటే ఇది..ఉన్నట్టుండి ఓ గిరిజన కార్మికుడు ధనవంతుడయ్యాడు. తాను కూలి పనిచేస్తున్న ప్రదేశంలోనే అతడిని అదృష్టం వరించింది. లీజుకు తీసుకున్న పొలంలో పనిచేస్తుండగా ఓ గిరిజన కార్మికుడికి అత్యంత విలువైన వజ్రం లభించింది. అది స్వచ్చమైన వజ్రం. వజ్రం లభ్యం కావడంతో అత్యంత పేదవాడైన ఈ గిరిజన కార్మికుడు ఇప్పుడు లక్షాధికారి అయిపోయాడు. వివరాల్లోకి వెళితే.
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఒక గిరిజన కూలీకి రూ. 40 లక్షల విలువైన వజ్రం దొరికింది. వజ్రాల గనులకు ప్రసిద్ధి అయిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన మాధవ్ అనే గిరిజన కూలీకి తాను పనిచేస్తున్న స్థలంలో 11.95 క్యారెట్ల విలువైన ఓ అద్భుతమైన వజ్రం లభించింది. ఈ వజ్రం విలువ సుమారు రూ. 40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు అధికారులు.
పన్నా జిల్లాలోని జారువాపూర్ గ్రామ సమీపంలో తవ్వకాలు జరుపుతుండగా మాధవ్కు ఈ వజ్రం లభించింది. అతను ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న చిన్న స్థలంలో పని చేస్తుండగా ఈ 11.95 క్యారెట్ల విలువైన వజ్రం దొరికింది.
దొరికిన వజ్రం అత్యంత నాణ్యత గల జేమ్ క్వాలిటీ వజ్రంగా గుర్తించారు ఇది పన్నా జిల్లా చరిత్రలో దొరికిన పెద్ద వజ్రాలలో ఒకటి. ఈ వజ్రం లభించడంతో మాధవ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. మాధవ్ ఈ వజ్రాన్ని స్థానిక వజ్రాల కార్యాలయంలో (Diamond Office) అప్పగించాడు. ప్రభుత్వ నియమాల ప్రకారం..ఈ వజ్రాన్ని వేలం వేస్తారు. వేలం ద్వారా వచ్చే డబ్బులో రాయల్టీ ,పన్నులు మినహాయించి మిగిలిన మొత్తం గిరిజన కార్మికుడు మాధవ్ కు చెల్లిస్తారు.
ALSO READ : ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చా..
పన్నా జిల్లా - వజ్రాల నిలయం:
పన్నా జిల్లా భారతదేశంలో విలువైన వజ్రాల గనులను కలిగి ఉన్న ప్రాంతం. ఇక్కడ వందలాది మంది కూలీలు ,చిన్న గని కార్మికులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు పన్నా జిల్లాలో సాధారణమే. ఇవి తరచుగా పేద కార్మికులకు గొప్ప ఆశాకిరణంగా మారతాయి.ఈ సంఘటన మాధవ్ కు ఆర్థికంగా చాలా సహాయం పడుతుంది.