భీమన్న ఆలయాన్ని రక్షించాలి : గోడం గణేశ్

భీమన్న  ఆలయాన్ని రక్షించాలి :  గోడం గణేశ్

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలం పోతారంలోని ఆదివాసీ నాయక్​పోడ్ తెగ ఆరాధ్య దైవం భీమన్న ఆలయాన్ని రక్షించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ ​డిమాండ్​చేశారు. ఆలయాన్ని గిరిజనేతరులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ జానకీ షర్మిలను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొంతకాలంగా ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. తాతల కాలం నుంచి నాయక్​ పోడ్ తెగకు చెందిన ఆదివాసీలు భీమన్న ఆలయంలో పూజలు చేస్తున్నారని తెలిపారు. 

గుడిపై కన్నేసిన గిరిజనేతరులు తమను ఆలయానికి రావొద్దంటున్నారని పేర్కొన్నారు. ఈ దౌర్జన్యంపై తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామన్నారు. తీసుకోకపోతే తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య, జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.