
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారంలో కొలువైన సమ్మక్క సారలమ్మ గద్దెల నూతన డిజైన్‌పై ఆదివాసీ పూజారులు విముఖత వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అమ్మవార్ల గద్దెలను విస్తరించేందుకు దేవాదాయ ఆర్కిటెక్చర్ రాజశేఖర్ గద్దెల డిజైన్లను రూపొందించారు. ఇటీవల మేడారం ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన రివ్యూలో ఈ డిజైన్లను చూపి పూజారుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.
అయితే కొత్త డిజైన్లపై పూజారులు విముఖత వ్యక్తం చేస్తూ, ఆదివాసీ కట్టుబాట్లు సంస్కృతి సంప్రదాయాలు గౌరవిస్తూ గద్దెల పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆఫీసర్లు పూజారులు, ఆఫీసర్లు సమన్వయంతో గద్దెల డిజైన్లను రూపొందించాలని సూచించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు శుక్రవారం మాట్లాడుతూ... గద్దెల కొత్త డిజైన్ కాకతీయులకు సంబంధించినట్లుగా ఉందన్నారు.