గిరిజన టీచర్లకు పదోన్నతులు, నియమకాలు చేపట్టాలి

గిరిజన టీచర్లకు పదోన్నతులు, నియమకాలు చేపట్టాలి

మెహిదీపట్నం, వెలుగు : రాష్ట్రంలో షెడ్యూల్ (ఏజెన్సీ) ఏరియాలో వివిధ శాఖల ఆధ్వర్యంలోని స్కూళ్లలో స్థానిక షెడ్యూల్ గిరిజన ఉపాధ్యాయులకు పదోన్నతులు, నియామకాలు చేపట్టాలని ట్రైబల్ టీచర్ యూనియన్ (టీటీయూ) జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం టీటీయూ జేఏసీ ఆధ్వర్యంలో మాసబ్​ట్యాంక్ సంక్షేమ భవన్ ఎదుట గిరిజన ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టగా.. ఏటీఏ, టీఎన్ టీటీఎఫ్, ఏటీఎఫ్, టీటీయా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రామారావు మాట్లాడుతూ.. రాజ్యాంగంలో ఆర్టికల్ 244(1) అనుసరించి ఐదో షెడ్యూల్​లో ఏజెన్సీ ప్రాంతాలను గుర్తించారన్నారు.  

ఆయా ప్రాంతాల్లో షెడ్యూల్ ట్రైబల్ చట్టాలు, హక్కుల రక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం 28 శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. అందులో విద్యాశాఖకు సంబంధించిన జీవో నం. -3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు  శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో 28 శాఖల్లో స్థానిక గిరిజన ఉపాధ్యాయులతోనే ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు ప్రక్రియను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్, టీటీయూ జేఏసీ రాష్ట్ర నేత మోకాళ్ల శ్రీనివాస్, టీటీఎఫ్ ఉపాధ్యక్షుడు ఎన్. భీమ్ సింగ్, టీటీఏ జిల్లా అధ్యక్షుడు బి. శ్రీనివాస్, శర్మ నాయక్, జయబాబు తదితరులు పాల్గొన్నారు.