గిరిజన వర్సిటీ ఆమోదం హర్షణీయం

గిరిజన వర్సిటీ ఆమోదం హర్షణీయం

తెలంగాణ రాష్ట్రంలోని మేడారంలో కొలువైన సమ్మక్క, సారలమ్మ వారి జాతర రెండు సంవత్సరాలకి ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవార్లను దర్శించుకుని, భక్తులు వారి మొక్కులను తీర్చుకుంటారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా  ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ జాతరకి వస్తుంటారు. మన రాష్ట్రంలో జరిగే అతి పెద్ద జాతర ఇదే. అయితే ఇక్కడున్న గిరిజనుల ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్’ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.  

కేంద్రప్రభుత్వం తెలంగాణలో గిరిజన వర్సిటీకి ఆమోదం తెల్పింది. నిన్న సోమవారం  పార్లమెంట్​లో జరిగిన లోక్​సభ సమావేశాల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ బిల్లును  ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ సభలో గిరిజన యూనివర్సిటీ స్థాపిస్తున్నామని చెప్పిన ప్రకారమే, ఇపుడు పార్లమెంటులో వెనువెంటనే ఆ బిల్లు తేవడం హర్షణీయం. 

ఇచ్చిన మాటను ఆచరణలో చూపుతున్నందుకు ప్రధాని అభినందనీయులు. సమ్మక్క, సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి ప్రజలకు మంచి ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది. అలాగే వారి కళలు, సంస్కృతి,- సంప్రదాయాలపై పరిశోధనలు చేయడానికి, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి బంగారు బాటలు పడనున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయం చేసే ఇతర కార్యకలాపాలు ఈ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. కాబట్టి ఎంతోమంది గిరిజనులకు ప్రయోజనం చేకూరనుంది.  కావున కేంద్రప్రభుత్వం వీలైనంత తొందరగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకి సంబంధించిన ప్రణాళికలు రూపొందించి విశ్వవిద్యాలయ  స్థాపనకు కృషి చేయాలి.

-కూరపాటి శ్రావణ్, జనగామ జిల్లా.