గిరిజనగూడెలకు రోడ్లు, కరెంట్.. పీఎం జన్మన్‌‌ స్కీమ్‌‌ కింద కేంద్రం నిధులు

గిరిజనగూడెలకు రోడ్లు, కరెంట్.. పీఎం జన్మన్‌‌ స్కీమ్‌‌ కింద కేంద్రం నిధులు
  • 11 శాఖల ద్వారా డెవలప్‌‌మెంట్‌‌ వర్క్స్‌‌
  • రాష్ట్రంలో 548 గ్రామాలు ఎంపిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కనీస వసతులు లేని గిరిజనగూడెల అభివృద్ధికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పీఎం జన్మన్‌‌ (ప్రధాన మంత్రి జన్‌‌ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌‌) స్కీమ్ కింద నిధులను ఖర్చు చేస్తోంది. ఈ స్కీంలో భాగంగా రాష్ట్రంలో కనీస వసతులు లేని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టానున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 548 గ్రామాల్లో..
పీఎం జన్మన్‌‌ కింద ఎంపికయ్యే గ్రామాల్లో కనీసం 20 ఫ్యామిలీలు ఉండాలని కేంద్రం గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేసింది. కనీస వసతులైన రోడ్లు, కరెంట్, వైద్యం, తాగునీరు వంటివి లేని గ్రామాలు రాష్ట్రంలో 548 ఉన్నట్లు స్టేట్‌‌ ట్రైబల్ ఆఫీసర్లు గుర్తించి కేంద్రానికి పంపారు. ఈ స్కీమ్‌‌ కింద దేశ వ్యాప్తంగా రూ.24 వేల కోట్లను ఖర్చు చేసి ట్రైబల్‌‌ ఏరియాల్లో పంచాయతీ రాజ్, ఆర్‌‌అండ్‌‌బీ, మెడికల్‌‌ హెల్త్‌‌, ట్రైబల్‌‌వెల్ఫేర్‌‌, మహిళ స్ర్తీ శిశు సంక్షేమం, స్కూల్‌‌ ఎడ్యుకేషన్, విద్యుత్ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. 

పీఎం అవాస్ యోజన స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఐదు లక్షల ఇండ్లు, 8 వేల కిలోమీటర్ల రోడ్లు వేయడంతో పాటు అంబులెన్స్‌‌లు, మెడికల్‌‌ యూనిట్లు, అంగన్‌‌ వాడీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో భాగంగా కొన్ని నిధుల శాంక్షన్‌‌ కావడంతో పనులు సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో పీఎం జన్మన్‌‌ 1.0 పోగ్రాం పూర్తి కాగా, ఆగస్ట్‌‌ నుంచి అక్టోబర్‌‌ 2 వరకు రెండో దశ కార్యక్రమం అమలుకానుంది. దీంతో ఇందులో చేపట్టాల్సిన పనులను స్టేట్‌‌ ఆఫీసర్లు పీఎం జన్మన్‌‌ పోర్టల్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తున్నారు. 

78 శాతం మందికి కార్డులు జారీ
పీవీటీజీ (పర్టిక్యులర్లీ వ్యాల్యూనేరబుల్‌‌ ట్రైబల్‌‌ గ్రూప్స్‌‌)లో భాగంగా గ్రామాల్లో ఉన్న చెంచులు, కొండ రెడ్లు, తోటి తెగలు, వెనుకబడిన గ్రామాలు, ప్రజలను ఆఫీసర్లు గుర్తించి అభివృద్ధి చేయడంతో పాటు జనాలకు అవసరమైన బ్యాంక్‌‌ అకౌంట్‌‌, పీఎం కిసాన్, ఆయుష్మాన్‌‌ భారత్‌‌, ఆధార్‌‌ కార్డులు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో ట్రైబల్ జనాభా అధికంగా ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 16,134 కుటుంబాలు, 65 వేల మంది జనాభాకు అవసరమైన పనులను కేంద్రం చేపట్టనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 65 వేల కుటుంబాల్లో 78 శాతం మందికి ఈ కార్డులు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వైద్య వసతుల్లో భాగంగా  211 గ్రామాల్లో మొబైల్ మెడికల్ యూనిట్లను కేంద్రం శాంక్షన్‌‌ చేసింది. 81 అంగన్‌‌ వాడీ కేంద్రాలను మంజూరు చేసినట్లు మహిళ స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.

వివిధ స్కీమ్‌‌లలో భాగంగా పనులు
ట్రైబల్‌‌ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్లను పీఎం అవాస్‌‌ యోజన కింద, రోడ్ల నిర్మాణాన్ని పీఎం గ్రామ సడక్‌‌ యోజన, తాగునీటి సరఫరాను జల్‌‌ జీవన్‌‌ మిషన్‌‌, నేషనల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌ కింద మొబైల్ మెడికల్‌‌ యూనిట్లు చేపట్టనున్నారు. అలాగే సమగ్ర శిక్ష అభియాన్‌‌ కింద హాస్టల్స్, సోలార్ స్కీమ్ కింద స్ర్టీట్‌‌లైట్స్‌‌, మహిళ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద అంగన్ వాడీ కేంద్రాలు, టెలికాం శాఖ నుంచి మొబైల్ టవర్ల నిర్మాణం చేస్తారు. పీఎం ఉజ్వల నుంచి గ్యాస్‌‌ కనెక్షన్లు, సివిల్‌‌ సప్లై నుంచి ఫుడ్‌‌ సెక్యూరిటీ కార్డులు, ఆర్థికశాఖ నుంచి జన్‌‌ధన్‌‌ అకౌంట్లు ఇస్తున్నారు. ఈస్కీమ్‌‌లకు స్టేట్ ట్రైబల్ డిపార్ట్‌‌మెంట్‌‌ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.