ఈ ప్రిన్సిపాల్​ మాకు వద్దంటే వద్దు

ఈ ప్రిన్సిపాల్​ మాకు  వద్దంటే వద్దు
  • నైట్​వాచ్​మన్ ​తాగొస్తున్నడు
  • సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవట్లే  
  • ఆసిఫాబాద్​లో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ స్టూడెంట్స్​ ఆందోళన 
  • కలెక్టరేట్​ గేట్లు తోసుకుని లోపలకు...
  • అక్కడే నాలుగు గంటల నిరసన  
  • ప్రిన్సిపాల్​ సస్పెన్షన్​ 

ఆసిఫాబాద్, వెలుగు : ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని,నైట్ వాచ్ మన్ రాత్రి తాగొస్తున్నాడని, కనీస సౌకర్యాలు లేక గోస పడుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ కుమ్రం భీం ఆసిఫాబాద్​జిల్లాలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్  బుధవారం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్​చేయాలంటూ రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలోని స్కూల్ నుంచి ర్యాలీగా అంబేద్కర్ చౌక్ చేరుకుని అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో, ధర్నాకు దిగారు. గంట సేపు రాస్తారోకో చేయగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అయినా, అధికారులు స్పందించకపోవడంతో అంబేద్కర్ చౌక్ నుంచి కలెక్టర్ క్యాంప్​ఆఫీస్​కు చేరుకుని గేట్లు తోసుకుని లోపలకు వెళ్లి ఆఫీసు ముందు బైఠాయించారు.  కలెక్టర్ బయటికి రావాలని నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కలెక్టర్ కూడా రాకపోవడంతో అక్కడి నుంచి కలెక్టరేట్ కు వెళ్లి ధర్నాకు దిగారు. 

ఆరు గంటల పాటు ఆందోళన నిర్వహించగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎంత నచ్చజెప్పినా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. చివరకు పది మంది స్టూడెంట్స్ ను కలెక్టరేట్ లోకి తీసుకువెళ్లి డీఆర్​వో కదం సురేష్ తో మాట్లాడించారు. వారి సమస్యలు విన్న డీఆర్​వో విచారణకు స్పెషల్ ఆఫీసర్​ను నియమించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సంతృప్తి చెందని స్టూడెంట్స్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మళ్లీ ధర్నాకు కూర్చున్నారు. ‘కలెక్టర్​రావాలి.. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి’ అంటూ నినాదాలు చేశారు. వీరి ఆందోళనను విరమింపజేయడానికి ఉన్నతాధికారులు టీచర్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది. 

వారు విద్యార్థుల దగ్గరకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. నిరసనను విరమింపజేయకపోతే ఉద్యోగాలు పోతాయని ఆఫీసర్లు హెచ్చరించడంతో టీచర్లు వచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా పలువురు స్టూడెంట్లు ప్రిన్సిపాల్, సిబ్బంది ప్రవర్తనతో ఇబ్బందులు పడుతున్నామని టీచర్లను పట్టుకుని బోరున విలపించారు. చివరకు టీచర్లు, పోలీసులు కలిసి వారిని సముదాయించి హాస్టల్​కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా హాస్టల్​లోపల కొద్ది సేపు బైఠాయించారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకునే వరకు అన్నం తినేది లేదంటూ పట్టుబట్టారు. ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఏమీ తినకుండానే ఆందోళన చేపట్టారు. 

పోలీసులు బతిమిలాడి భోజనం చేయించేందుకు తీసుకువెళ్లారు.  విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్​లో భోజనం సరిగ్గా లేదని, బాత్​రూమ్, ​టాయిలెట్, డార్మెట్ రూమ్ లలో కనీస సౌకర్యాలు లేవని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. గతంలో ఆర్​సీవో దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు.  కాగా, ప్రిన్సిపల్​ జ్యోతి లక్ష్మిని సస్పెండ్​ చేస్తూ సోషల్​ వెల్ఫేర్​ అండ్​ ట్రైబల్​ వెల్ఫేర్​ సెక్రెటరీ నవీన్​ నికోలస్​ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆర్​సీవో గంగాధర్​ తెలిపారు.