దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నా..ఆదివాసీలు ఉండే ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిపోతున్నాయి. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల ప్రజలు వైద్యారోగ్య సేవల కోసం అరిగోసపడుతున్నారు. తాజాగా ఓ గర్బిణీ ప్రసవం కోసం నరకం అనుభవించింది. సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడంతో నట్టడవిలో నాలుగు గంటలు పురిటినొప్పులతో తీవ్ర నరకం అనుభవించింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసీపేటకు చెందిన గంగామణి అనే గిరిజన మహిళకు ఆగస్టు 24వ తేదీ గురువారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. అయితే ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు గంగామణిన 15 కి.మీ దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలనుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. రోడ్డుసరిగా లేదని గ్రామం వరకు రాలేమని పస్పుల బ్రిడ్జ్ దాటించి తీసుకువస్తే ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు. చేసేదేమి లేక గర్భిణి కుటుంబ సభ్యులు ఎడ్లబండిలో గంగామణిను కడెం వాగు దాటించారు. అయితే ఒడ్డుచేరాక కూడా అంబులెన్స్ రాలేదు. ఎందుకు రాలేదంటే అంబులెన్స్ లో డిజిల్ అయిపోయిందంటూ సమాధానం ఇవ్వడంతో చేసేది లేక అదే ఎండ్ల బండిలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ..
నడిరోడ్డుపైనే..
అప్పటికే నొప్పులు తీవ్రం కావడంతో గర్బిణీ గంగామణి అర్థరాత్రి 12 గంటలకు నడిరోడ్డుపై మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన తర్వాత అంబులెన్స్ వచ్చింది. అనంతరం ఆమెకు ప్రథమ చికిత్స అందించిన సిబ్బంది.. పెంబి ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు.
వర్షాల వల్ల...
భారీ వర్షాలకు తులసీపేట సమీపంలోని పస్పుల బ్రిడ్జి కడెం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ గ్రామంతో పాటు మరో 10 ఆదివాసీ మారుమూల గ్రామాల ప్రజలు వాగును దాటడానికి నరకం అనుభవిస్తున్నారు. తప్పనసరి పరిస్థితుల్లో..ప్రాణాల పణంగా పెట్టి నీటిలోనే వాగును దాటుతున్నారు. ఈ క్రమంలోనే గర్బిణీ గంగామణిని వాగు దాటించి తీసుకురమ్మని అంబులెన్స్ సిబ్బంది సూచించారు.
