అడవి బిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం .. జీవో 49 నిలుపుదలపై ఉమ్మడి జిల్లాలో వేడుకలు

అడవి బిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం .. జీవో 49 నిలుపుదలపై ఉమ్మడి జిల్లాలో వేడుకలు

ఆసిఫాబాద్/ఆదిలాబాద్/దండేపల్లి/జన్నారం, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాను కన్జర్వేషన్ రిజర్వ్ ప్రకటిస్తూ విడుదల చేసిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. సీఎం, నేతల ఫొటోలకు క్షీరాభిషేకాలు చేశారు. ఆసిఫాబాద్​లోని కాంగ్రెస్​ ఆఫీస్ లో జరిగిన వేడుకల్లో డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు పాల్గొన్నారు. ఆదివాసీలకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తోందని.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఫొటోలకు లీడర్లతో కలిసి క్షీరాభిషేకం చేశారు.

 మాజీ ఎంపీపీ బాలేశ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాదివేణి మల్లేశ్, పార్టీ మండల అధ్యక్షుడు మసాదే చరణ్ తదితరులు పాల్గొ న్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తోందని రాష్ట్ర గిరిజన ఆర్థికాభివృద్ధి కో ఆపరేటివ్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. జీవో రద్దుపై దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో ఆదివాసీసంఘాల ఆధ్వర్యంలో కుమ్రం భీం విగ్రహంతో పాటు సీఎం ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఆదిలాబాద్​లో కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకొన్నారు. జన్నారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎంతోపాటు మంత్రులు, నేతల ఫొటోలకు అదివాసీలు క్షీరాభిషేకం చేశారు.