
- అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగిన ఆదివాసీలు
- కావరా కొత్తపల్లి అడవిలో ఘటన
కోటపల్లి, వెలుగు: మండలంలోని కావరా కొత్తపల్లి అడవిలో పట్టుపురుగుల పెంపకాన్ని అటవీ శాఖ అధికారులు బుధవారం అడ్డుకున్నారు. చెట్లపై పెరుగుతున్న పట్టు పురుగులను కిందికి విసిరేశారు. వాటిని తిరిగి చెట్లపైనే వేస్తామని ఆదివాసీలు చెప్పగా.. వారు నిరాకరించారు. అడవి పాడవుతుందని, తమ అనుమతి తీసుకుంటేనే పట్టు పురుగుల పెంపకం చేపట్టాలనడంతో ఆదివాసీలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోటపల్లి మండలంలోని కావరా కొత్తపల్లి, రాజారాం, లింగన్నపేట, ఏదుల బంధం, నాగంపేట, బొప్పారం, పారుపల్లి గ్రామాల్లోని 750కి పైగా కుటుంబాలకు పట్టు పురుగుల పెంపకమే జీవనాధారమని, 8 దశాబ్దాలుగా ఇదే పని చేస్తున్నామన్నారు.
ఇప్పుడే అడవి పాడవుతుందా అని ప్రశ్నించారు. పట్టుపురుగుల పెంపకాన్ని అడ్డుకుంటే తాము బతికేదెలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అవకాశం ఉన్నా అడవిలోని చెట్లను నరికి పోడు వ్యవసాయం చేసుకోలేదని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని
కోరుతున్నారు.