పోడు రైతులపై ఫారెస్ట్ ఆఫీసర్ల దాడులు ఆపాలి : కారం పుల్లయ్య

పోడు రైతులపై ఫారెస్ట్ ఆఫీసర్ల దాడులు ఆపాలి : కారం పుల్లయ్య
  • అర్హులైన ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలి
  • తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్ 
  • ఏటూరు నాగారం ఐటీడీఏ ఆఫీస్ ను ముట్టడించిన గిరిజనులు 

ఏటూరునాగారం, వెలుగు : పోడు భూములు సాగు చేసుకునే ఆదివాసీలపై ఫారెస్ట్​ఆఫీసర్ల దాడులు ఆపాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. సోమవారం ఏటూరు నాగారం ఐటీడీఏ ముట్టడించి బైఠాయించారు. అంతకుముందు ఏటూరునాగారం బస్టాండ్ నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య, ఉపాధ్యక్షుడు బి.రవికుమార్ మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో ఫారెస్ట్ అధికారులు పోడు రైతులపై అక్రమ కేసులు పెడుతూ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఫారెస్ట్ ఆఫీసర్లు తమ వైఖరిని మార్చుకోకపోతే గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

 గిరిజన హక్కులను హరిస్తూ అడవి నుంచి వెళ్లగొట్టేందుకు సర్కార్ తెచ్చిన జీవో 49ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే జీవో. 3ను పునరుద్ధరించాలని కోరారు.  అదేవిధంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. సాగులోని పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఆలుబాక, సీతారాంపురం మధ్య వీరాపురం గ్రామానికి వెళ్లేందుకు వాగుపై వంతెన నిర్మించాలన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందజేశారు.

 పోడు భూములపై ఫారెస్ట్ దాడులు ఆపేందుకు డీఎఫ్​వోతో మాట్లాడతానని, హక్కు పత్రాలు ఉన్నవారికి గిరి జల వికాసం కింద బోర్లు మంజూరు చేస్తామని, ఐటీడీఏ కోటాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని పీవో హామీ ఇచ్చారు. ర్యాలీలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుగ్గి చిరంజీవి, గొంది రాజేశ్, జిల్లా కమిటీ సభ్యులు జజ్జరి దామోదర్ తో పాటు సుమారు 3 వేల మంది గిరిజనులు పాల్గొన్నారు.