
నాలుగున్నర దశాబ్ధాల కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో పాత్రలు పోషించిన తాను ఇకపై అమితాబ్ బచ్చన్ తరహాలో వైవిధ్యమైన పాత్రలు మాత్రమే పోషించాలని భావిస్తున్నానని అని సత్యరాజ్ అన్నారు. ఆయన లీడ్ రోల్‌లో వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ ఇతర ముఖ్యపాత్రల్లో మోహన్ శ్రీవత్స రూపొందించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సత్యరాజ్ మాట్లాడుతూ ‘ఇందులో కథే మెయిన్ హీరో. డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్ అసలైన బాణాలు. 70 ఏళ్లు దాటినా కూడా నేను కొత్త కొత్త పాత్రల్ని చేయాలని అనుకుంటున్నా. ఇందులోనూ డిఫరెంట్ రోల్ చేశా’ అని అన్నారు. ఉదయ భాను మాట్లాడుతూ ‘నేనేమీ సినిమాలకు దూరంగా లేను.
నచ్చిన పాత్రలు వస్తేనే నటిస్తున్నా. ఇందులో చాలెంజింగ్ రోల్ చేశా. ఈ చిత్రం అందరికీ కన్నుల పండుగగా ఉంటుంది’ అని చెప్పింది. కథ, స్ర్కీన్‌ప్లే చాలా కొత్తగా ఉండబోతోందని, ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయని వశిష్ట ఎన్ సింహా చెప్పాడు. క్లారిటీ, కమిట్మెంట్, కంటెంట్ ఉన్న చిత్రమిదని దర్శకుడు మోహన్ శ్రీవత్స అన్నాడు. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి, నటులు క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.