
లంబాడీ ఐక్యవేదిక రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి వెంకన్న నాయక్
కుషాయిగూడ, వెలుగు: గిరిజన లంబాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును కఠినంగా శిక్షించాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు వెంకన్న నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం కాప్రాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లంబాడీలకు, కొయ్య, గొండు సోదరుల సామాజిక వర్గాల మధ్య పాకిస్తాన్ ఇండియావలే యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. నెలరోజుల క్రితం ఆదిలాబాద్లో లంబాడీ, కొయ్య సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపడంతో జరిగిన ఘర్షణలో నలుగురు చనిపోవడం దారుణమన్నారు. ఓయూలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు లంబాడీల తండాలను తగుల పెడుతామనడాన్ని ఖండిస్తున్నామన్నారు. బిక్షం నాయక్, హరి నాయక్, వెంకటేష్ నాయక్పాల్గొన్నారు.
‘ప్రొ. నాగేశ్వర్ వ్యాఖ్యలు బాధాకరం’
ఓయూ: ఉన్నతమైన హోదాలో ఉన్న ఆదివాసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని తెలంగాణ యూనివర్సిటీస్ ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ ( టీయూటీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.రెడ్యా నాయక్, ప్రధాన కార్యదర్శి డా. బీమా నాయక్ అన్నారు. శుక్రవారం ఓయూ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ డా.నాగేశ్వరరావు లంబాడీలను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీయూటీటీఏ ఆధ్వర్యంలో ఓయూలో 20 న జరిగే సదస్సును విజయవంతం చేయాలని కోరారు.