కృష్ణకు కన్నీటి వీడ్కోలు..అంత్యక్రియలకు భారీగా వచ్చిన ఫ్యాన్స్

కృష్ణకు కన్నీటి వీడ్కోలు..అంత్యక్రియలకు భారీగా వచ్చిన ఫ్యాన్స్

కృష్ణ అంత్యక్రియలు పూర్తి

మహా ప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కృష్ణ పార్థివ దేహానికి  పోలీసులు గౌరవవందనం సమర్పించారు. అంతమకు ముందు పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరకు జరిగిన అంతిమ యాత్రకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

కొనసాగుతున్న కృష్ణ అంతిమయాత్ర

సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. నానక్ రామ్ గూడలోని పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్తానం వరకు ఈ అంతిమయాత్ర సాగనుంది. మహాప్రస్తానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 

కృష్ణ అభిమానుల రాకతో నానక్ రామ్ గూడలో ఫుల్ రష్ ఏర్పడింది. అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. తెలంగాణతోపాటు ...ఏపీ జిల్లాల నుంచి ఫ్యాన్స్ భారీగా వస్తున్నారు. ఇటు నానక్ రామ్ గూడ, ఫిల్మ్ నగర్ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

కృష్ణ పార్థివ దేహానికి బండి సంజయ్ నివాళి

సూపర్ స్టార్ కృష్ణ పార్ధివ దేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళి అర్పించారు. మహేష్ బాబుతో పాటు, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బండి సంజయ్ తో పాటు  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, సినీ నటి జీవిత సూపర్ స్టార్ కృష్ణ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.
 

 

కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ

కృష్ణ పార్థివ దేహానికి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప‌ద్మాల‌య స్టూడియోకు వెళ్లి కృష్ణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహేష్ బాబుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సాహసాల‌కు, ప్రయోగాలకు మారు పేరని చెప్పారు. టాలీవుడ్ కు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. మొద‌టి కౌబాయ్ సినిమా, మొద‌టి సినిమా స్కోప్ సినిమా, మొద‌టి 70 ఎం ఎం సినిమా, మొద‌టి డిటిఎస్ సౌండ్ సిస్టమ్ మూవీ.. ఇలా చాలా టెక్నిక‌ల్ అంశాల‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారని కొనియాడారు. న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గానూ రాణించారని.. ప‌ద్మాల‌యా స్టూడియోను స్థాపించారన్నారు. సాంఘిక‌, జాన‌ప‌ద‌, చారిత్రాత్మక చిత్రాల్లో న‌టించారని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల హృద‌యాల్లో కృష్ణ చెర‌గ‌ని స్థానం ద‌క్కించుకున్నారని అన్నారు. 

కృష్ణ పార్థీవదేహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు 

సూపర్ స్టార్ కృష్ణ పార్థీవదేహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోలోని కృష్ణ భౌతికదేహానికి పుష్పాంజలి ఘటించారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ తర్వాత కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాడ సానుభూతి తెలిపారు. జగన్ వెంట పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు ఉన్నారు.

 

కడచూపు కోసం తరలివస్తున్న ఫ్యాన్స్ 

సూపర్ స్టార్ కృష్ణను చివరిసారి చూసేందుకు అభిమానులు,  ప్రముఖులు పద్మాలయ స్టూడియోకు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని గుంటూరు, చీరాల, మదనపల్లి, చిత్తూరు, ఏలూరు, కైకలూరు, అమలాపురం నుంచి వచ్చిన ఫ్యాన్స్... తమ అభిమాన నటుడి పార్థివ దేహాన్ని చూసేందుకు రాత్రి నుంచి పడిగాపులు గాస్తున్నారు. ఇక ఇంతకు మునుపే కృష్ణ పార్థీవదేహాన్ని నానక్ రామ్ గూడలోని నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకి తరలించారు. అభిమానుల సందర్శనార్ధం మధ్యాహ్నం వరకు పద్మాలయ స్టూడియోలో కృష్ణ మృతదేహాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం పద్మాలయ స్టూడియో నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం మహాప్రస్తానంలో కృష్ణ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. 

మరోవైపు కృష్ణ మృతికి సంతాపంగా ఇవాళ తెలుగు సినీ ఇండస్ట్రీ బంద్ పాటిస్తోంది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం ప్రకటించింది. పద్మాలయ స్టూడియోకి కృష్ణ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. నానక్ రామ్ గూడకు వచ్చే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం కృష్ణ మృతదేహానికి ఏపీ సీఎం జగన్ నివాళులర్పించనున్నారు.

ఏ ఆర్టిస్ట్‌కు దక్కని గౌరవం నాకు దక్కింది : కృష్ణ పర్సనల్ మేకప్ మెన్ మాధవరావు

కృష్ణ గారు మన మధ్య లేరు అంటే ఏదో పోగొట్టుకున్నానన్న ఫీలింగ్ లో ఉన్నానని సూపర్ స్టార్ కృష్ణ పర్సనల్ మేకప్ మెన్ మాధవరావు అన్నారు. ఆయనతో బాస్, ఆర్టిస్ట్ లా కాకుండా అన్నదమ్ముల బంధంలా ఉండేదని చెప్పారు. ఆయన చాలా గొప్ప మనిషన్న మాధవరావు..  ఏ ఆర్టిస్ట్ కు దక్కని గౌరవం తనకు దక్కిందని, ఆయనతో పనిచేయడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నానని గర్వంగా చెప్పుకున్నారు. 1965 నుండి ఆయన తో ట్రావెల్ అవుతున్నాన్నారు. సినిమాలోకి రాకముందు నాటకాల వేసే టైం నుండి ఆయనతో మంచి స్నేహాభావం ఉండేదని చెప్పారు.  కృష్ణ వేసిన పాత్రలలో తనకు అత్యంత ఇష్టమైన గెటప్ అల్లూరి సీతారామరాజు, మెసగాళ్లకు మోసగాడు అని స్పష్టం చేశారు. - మేకప్, గెటప్ విషయంలో తాను వేసిన తరవాత ఎవరు ఎం చెప్పినా పట్టించుకునేవరు కాదని చెప్పారు.  ఏ హీరో వేయని గెటప్ లు ఆయన వేశారన్న ఆయన.. కృష్ణ గారితో 300 సినిమాలకు పైగా పని చేశానని తెలిపారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక శకం ముగిసింది. వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన తార నింగికెగిసింది. సినీ పరిశ్రమలో అనేక ప్రయోగాలకు ఆద్యుడు, దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకొని వేలాది మంది అభిమానులు చివరి చూపు కోసం తరలివస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, కళాభిమానులు కృష్ణకు నివాళులు అర్పించారు. ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను, అందించిన ప్రోత్సాహాన్ని, వ్యక్తిగత సహాయాన్ని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ మృతికి సంతాపంగా బుధవారం తెలుగు సినీ పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు, అన్ని షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిలిపివేస్తున్నట్లు సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ ప్రకటించారు.

పద్మాలయా స్టూడియోకి చేరుకున్న కృష్ణ పార్థివదేహం

సూపర్ స్టార్ కృష్ణ  పార్థివదేహన్ని కుటుంబసభ్యులు నానక్రామ్గూడలోని ఆయన నివాసం నుంచి పద్మాలయా స్టూడియోకు తరలించారు. ఉదయం 11 గంటలకు  ఏపీ సీఎం జగన్...  కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు.  మధ్యాహ్నాం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం కృష్ణ  పార్థివదేహన్ని అక్కడే  ఉంచనున్నారు.- ఆ తరువాత అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.

సాయంత్రం నాలుగు గంటలకు కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. తమ అభిమాన నటుడ్ని కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కార్డియాక్‌ అరెస్టుతో  కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.