పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో దూసుకెళ్తున్న టీఎంసీ

పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో దూసుకెళ్తున్న టీఎంసీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) దూసుకెళ్తోంది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుతోంది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర వ్యాప్తంగా జులై 8వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం (జులై 11న) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 22 జిల్లాల్లోని 339 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటిరకు రాష్ట్రంలోని సుమారు 74 వేల స్థానాల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 3 వేల స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 63 వేల 229 గ్రామ పంచాయతీ స్థానాలు ఉండగా అధికార పార్టీ 2 వేల 548 చోట్ల, బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సీపీఎం, కాంగ్రెస్‌ ఇంకా ఖాతా తెరువలేదు. 

పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా రాష్ర్టంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. తీవ్ర రాజకీయ హింస జరిగిన 697కు పైగా బూత్‌లలో రీ ఎలక్షన్లను నిర్వహించారు. బెంగాళ్ వ్యాప్తంగా 73,887 పంచాయతీ స్థానాలకు 61 వేలకు పైగా బూత్‌లలో పోలింగ్‌ జరగగా, 80.71 శాతం పోలింగ్‌ నమోదైంది. 

బరిలో ఉన్న 2.06 లక్షల మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. 2018లో జరిగిన బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34 శాతం సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90 శాతం విజయం సాధించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు మమతా బెనర్జీ, బిజెపికి అగ్ని పరీక్షగా నిలవనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరికి ప్రజలు పట్టం కడతారో తెలియాలంటే..  సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.