అస్సాంలో ర్యాడిసన్ బ్లూ హోటల్ వద్ద ఉద్రిక్తత

అస్సాంలో ర్యాడిసన్ బ్లూ హోటల్ వద్ద ఉద్రిక్తత

గౌహతి ర్యాడిసన్ బ్లూ హోటల్ ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసోంను క్యాంప్ రాజకీయాలకు వేదికగా సీఎం హిమంత బిశ్వ శర్మ మార్చారంటూ తృణమూల్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో హోటల్ ముందు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వరదల్లో చిక్కుకుని అసోం జనం ఇబ్బందులు పడుతుంటే.. బీజేపీ మంత్రులు హోటల్స్ చుట్టూ తిరుగుతున్నారని అసోం తృణమూల్ అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. ముందు వరదల్లో ఇబ్బంది పడుతున్న జనం కష్టాలు తొలగించాలని డిమాండ్ చేశారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ ముందు ఈ ధర్నా జరగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంతకు ముందే అసోం మంత్రి అశోక్ సింఘాల్ హోటల్ లోపలికి వెళ్లి ఏక్ నాథ్ షిండే రెబెల్ ఎమ్మెల్యేలను కలిసి వచ్చారు. అదే సమయంలో తృణమూల్ నేతలు అక్కడికి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నామని, వెళ్లేది లేదని తృణమూల్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారందరినీ పోలీసులు అక్కడి నుంచి తరలించారు. 

 

శివసేన పార్టీ నిలబడుతుందని సంజయ్ రౌత్ చెబుతున్నారు. కొందరు ఒత్తిడిలోనే ముంబై విడిచిపెట్టి వెళ్లిపోయారని అంటున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. కొందరు ఈడీ భయంతో ముంబై విడిచి వెళ్లారని, నిజమైన శివసైనికులు ఈడీకి భయపడబోరని రౌత్ అన్నారు. తనపై, తన కుటుంబంపై ఎంత ఒత్తిడి ఉన్నా చివరి శ్వాస వరకు థాక్రే వెంటే ఉంటామని సంజయ్ రౌత్ చెప్పారు. తమ పార్టీకి చెందిన మంత్రులు ఇప్పటికే ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని, అయినా ఉద్ధవ్ థాక్రే వెంటే ఉన్నారని గుర్తు చేశారు. 

. సీఎం ఉద్ధవ్ థాక్రే కాసేపట్లో శివసేన కీలక నేతలతో సమావేశం కానున్నారు. అటు ఏక్ నాథ్ షిండే శిబిరంలో టూబై థర్డ్ మెజార్టీ అంటే 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో షిండే ఏ క్షణమైనా తన క్యాంప్ తో ముంబై చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే శివసేన ఎల్పీ నేతగా షిండేనే ఉన్నట్లు రెబెల్ ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కు ఓ లేఖ పంపారు. ఇంకోవైపు శరద్ పవార్ నివాసంలో ఎన్సీపీ కీలక నేతల భేటీ జరుగుతోంది. శివసేన క్యాంప్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో తదుపరి ఎవరితో జట్టుకట్టాలన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అటు ప్రియాంక గాంధీ కూడా ముంబైకి చేరుకున్నారు.