దీదీ కోటకు బీటలు..100 మంది కౌన్సిలర్ల రాజీనామా.. బీజేపీ వైపు ఎంపీ, ఎమ్మెల్యేలు.?

దీదీ కోటకు బీటలు..100 మంది కౌన్సిలర్ల రాజీనామా.. బీజేపీ వైపు ఎంపీ, ఎమ్మెల్యేలు.?

పశ్చిమ బెంగాల్ లో  ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకప్పుడు బెంగాల్‌ను శాసించిన తిరుగులేని శక్తి.. ఇప్పుడు ముక్కలు ముక్కలయ్యే ప్రమాదంలో పడింది. పార్టీ ఓటమి తర్వాత ఏకంగా 100 మంది కౌన్సిలర్లు సామూహికంగా రాజీనామాలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

1998లో కాంగ్రెస్ నుండి విడిపోయి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించిన తర్వాత.. గత 28 ఏళ్లలో పార్టీ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభం ఇదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పార్టీని ఒంటిచేత్తో నడిపించిన మమత.. ఇప్పుడు సొంత నేతలను ఆపలేకపోతున్నారు. రాజీనామాలు చేయవద్దని ఆమె స్వయంగా కోరినప్పటికీ, మున్సిపల్ బోర్డుల్లో అశాంతి చల్లారడం లేదు. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. వచ్చే ఏడాది పురపాలక ఎన్నికలు జరగక ముందే అనేక మున్సిపల్ బోర్డులు రద్దు అయ్యేలా కనిపిస్తున్నాయి. అటు మమతకు అత్యంత సన్నిహితుడు, కోల్‌కతా మేయర్ అయిన ఫిర్హాద్ హకీమ్ కూడా రాజీనామాకు సిద్ధపడ్డారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

పార్టీలోని అసంతృప్తి ఇప్పుడు వీధికెక్కింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింసకు నిరసనగా టీఎంసీ చేపట్టిన మొట్టమొదటి ప్రధాన నిరసన ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 36 మంది మాత్రమే ఈ నిరసనకు హాజరయ్యారు. మరోవైపు, సీనియర్ నేతలు బహిరంగంగానే తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. తాజాగా.. లోక్‌సభ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ బరసత్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశానికి ఆమెతో పాటు ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు హాజరుకావడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

దీంతో బరసత్ ఎంపీతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలోనే కషాయ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కోటలు బద్దలవుతున్న వేళ.. మున్సిపల్ సంస్థల్లో తమ ప్రాబల్యాన్ని విస్తరించుకోవడానికి బీజేపీకి ఇదొక సువర్ణావకాశంగా మారింది. మమతా బెనర్జీ చంచల స్వభావం, ఒంటెద్దు పోకడలే ఈ పతనానికి కారణమంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ సుడిగుండం నుండి దీదీ తన పార్టీని ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.