గుండెపోటుతో చనిపోయిన ఎమ్మెల్యే.. అప్పటి వరకు బాగానే తిరిగారు..

గుండెపోటుతో చనిపోయిన ఎమ్మెల్యే.. అప్పటి వరకు బాగానే తిరిగారు..

త్రిపుర సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సంసుల్ హక్ తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. 67ఏళ్ల హక్ కు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు.

అగర్తల ఎమ్మెల్యే హాస్టల్‌లో ఉన్న సెపాహిజాలా జిల్లాలోని బోక్సానగర్‌కు చెందిన శాసనసభ్యుడు హక్ జూలై 18న రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను జీబీ పంత్ ఆసుపత్రికి తరలించగా ఆయన ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పబిత్రాకర్ తెలిపారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి మాణిక్ సాహా సంతాపం తెలిపారు.

ALSO READ :16 మందికి చేరిన ఉత్తరాఖండ్ ప్రమాద మృతులు

"ఎమ్మెల్యే సంసుల్ హక్ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు నివాళిగా నా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నాను" అని మాణిక్ సాహా తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

హక్ భౌతికకాయాన్ని తొలుత రాష్ట్ర అసెంబ్లీకి తరలించగా.. అక్కడ డిప్యూటీ స్పీకర్ రాంప్రసాద్ పాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్, బీజేపీ ఎమ్మెల్యే కిషోర్ బర్మన్ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. ఇక సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, లెఫ్ట్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ నారాయణ్‌కర్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్‌ డే హక్‌కు నివాళులర్పించారు. హక్ మరణంతో 60 మంది సభ్యుల అసెంబ్లీలో సీపీఐ(ఎం) సీట్ల సంఖ్య పదికి పడిపోయింది.