వాళ్ల కష్టం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు

వాళ్ల కష్టం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు

ఒక సినిమా ఆడలేదంటే మనం పనిని నెగ్లెక్ట్ చేసినట్టు కాదు. మన పని ప్రేక్షకులకు నచ్చలేదని. ప్రేక్షకుల్ని దేవుళ్లు అని ఎందుకంటారంటే
థియేటర్లో లైట్స్ ఆఫ్ అయ్యాక కులం, మతం, ప్రాంతం దేనితో సంబంధం లేకుండా వాళ్లు తమ దృష్టంతా సినిమా మీద కేంద్రీకరిస్తారు కాబట్టి. ఆ కథ వాళ్లకు నచ్చితే బయటికొచ్చాకబాగుందని, నచ్చకపోతే బాలేదని చెప్పడం వాళ్ల ధర్మం. అదే వాళ్లు చేస్తారు.వాళ్లు నిస్పక్షపాతంగా ఉంటారు.

‘అల వైకుంఠపురములో’ తెరకెక్కింది. ఈ నెల 12న మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా త్రివిక్రమ్‌‌తో చిట్‌‌చాట్.

  •  ప్రపంచం చుట్టూ ఎంత తిరిగినా ఇంటికొచ్చేసరికి హాయిగా ఫీలవుతాం. అంటే ఇల్లుని మించింది లేదనే కదా అర్థం. ఇల్లు  మన సంస్కృతిలో భాగం. అందుకే నా సినిమాలన్నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి.
  • ‘అజ్ఞాతవాసి’ ఫ్లాపయ్యాక మళ్లీ మళ్లీ ఆ టైప్‌‌ స్టోరీ చేయడమెందుకు, అలవాటైన హ్యూమర్ అండ్​ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్​జానర్‌‌‌‌నే ఎంచుకుంటే బెటర్ కదా అని నాతో పని చేసేవాళ్లు,   శ్రేయోభిలాషులు అనుకోవచ్చు. కానీ  అంతటి పరాజయం పొందాక కొత్తగా భయపడేది లేదు. ఆల్రెడీ నాలో ఉన్న ఫియర్‌‌‌‌ని​ గెలవడానికే ‘అరవింద సమేత’ సినిమా తీశాను.
  • ఏ కథ చెప్పినా రామాయణ, భారతాలను మించిన కథ  అందించలేమన్నది అక్షర సత్యం.  ఈ సినిమాలో ఎక్కడో ఒకచోట ఆ ప్రభావం ఉండచ్చేమో. కానీ నేను దాన్ని పట్టించుకోను.
  • ఇష్టం, ప్రేమ కూడా ఒక్కోసారి మనల్ని బందీలుగా చేస్తాయి.  పెద్దరికం అనే ఇమేజ్‌‌కి కూడా  కొంతమంది బందీలయిపోతారు. వాళ్ల ఇమేజ్​దాటి బయటకు రావడమే భయాన్ని గెలవడం.
  • ఎప్పటికప్పుడు మారడానికే ప్రయత్నిస్తాను. మూస పద్ధతిలో  తియ్యాలనుకోను. నా సినిమాతో పాటు ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో కూడా పట్టించుకోను.  అయితే వేరేవాళ్ల సినిమాలు చూస్తాను. కానీ ఏ సినిమా చూసినా ఎలాంటి వెయిట్​ లేకుండా చూస్తా. కొన్ని సినిమాలు చూసి ఇలాంటిది నేను చేయలేకపోయానే అని జెలసీ ఫీలవుతాను. చాలాసార్లు అందరూ నాకంటే బాగా రాస్తారనే ఫీలింగ్​ కలుగుతుంది.
  • కథ, పాత్రలు, సన్నివేశాల తర్వాతే డైలాగులు మొదలవుతాయి. అందుకే ఒక్క డైలాగ్స్ వల్లే సినిమా హిట్టవుతుందంటే నేను ఒప్పుకోను. అవి కథకి బలమవ్వాలి అంతే.
  • 1970 వరకూ మన ఇళ్లల్లో ఎక్కువగా ఆడవాళ్లే రూల్​ చేసేవారు. పొలం కొనాలన్నా, నగలు చేయించాలన్నా, పెళ్లిల్లు చెయ్యాలన్నా వాళ్ల పెత్తనమే సాగేది. తర్వాత్తర్వాత వాళ్లు కూడా ఉద్యోగాలు చెయ్యడం, విదేశాలకు వెళ్లడం వల్ల ఆ ఆటిట్యూడ్​ నుంచి బయటికొచ్చేసారు. కానీ రూట్స్‌‌ వదల్లేం కదా! మన జీవితాల్లో  పిన్ని, అత్త  పెద్ద పాత్రలే  పోషిస్తారు. అలాంటప్పుడు వాళ్లను  తక్కువగా ఎందుకు చూపించాలి? అందుకే నా సినిమాల్లో ఆడవాళ్లకి ప్రాధాన్యతనిస్తా.
  • కథ రాసేటప్పుడు గోవా వెళ్లాలి, మనాలి వెళ్లాలి అనుకోను. హాయిగా ఇంట్లో కూర్చుని, పిల్లలు అల్లరి చేస్తుంటే, నా భార్య వంట చేస్తుంటే ఆ శబ్దాలు విని ఎంజాయ్​ చేస్తూ  రాసుకుంటాను. టైటిల్స్​ విషయంలో నాకు ‘అ’ సెంటిమెంట్​ ఉందని చాలామంది అనుకుంటున్నారు. అది నిజం కాదు. నేనవన్నీ అనుకోకుండా పెట్టినవే తప్ప ఏదో సెంటిమెంట్‌‌తో కావాలని పెట్టినవి కావు. సెంటిమెంట్ లేదని కాదుగానీ.. ఇలాగే పెట్టాలి అనే సెంటిమెంటయితే లేదు.
  • నన్ను అభిమానించేది నన్ను చూసి కాదు, నా పనిని చూసి అనే విషయం నాకు తెలుసు. అందుకే ఏ విషయాన్నీ నేను ఎక్కువ సీరియస్‌‌గా తీసుకోను. అలా తీసుకుంటే జీవితంలో ఉండే ఎంజాయ్‌‌మెంట్​కోల్పోతాం. కష్టానికి జడ్జిమెంట్​ లేదు. ఎవరి కష్టం వాళ్లది. కష్టపడనిదే ఎవరూ వాళ్ల జీవితాలను సాగించలేరు. పక్కవాడి కష్టం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.
  • ఎప్పటికప్పుడు ఓ కొత్త కథను ప్రేక్షకులకు అందిస్తేనే మనం ఇండస్ట్రీలో ఉన్నట్టు లెక్క. దాని కోసమే ట్రై చేస్తుంటా. చిరంజీవిగారితో సినిమా చేయాలి కానీ ఇంకా ఏమీ అనుకోలేదు. అసలు కథ కూడా ఇంకా ఆలోచించలేదు. ఆయనకి తగిన కథ తట్టగానే చెప్తాను.  ఏదైనా మంచి కథ దొరికితే ఇతర భాషల్లో కూడా సినిమా తీస్తాను.