త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్య ప్రదర్శన

త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్య ప్రదర్శన

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య  నృత్య  ప్రదర్శనతో భావ రస నాట్యోత్సవం  ఫస్ట్  సీజన్  ప్రారంభమైంది. ‘మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’  ఆధ్వర్యంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫీనిక్స్ అరేనాలో ఆదివారం సాయంత్రం  జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారులచే శాస్త్రీయ నృత్య రూపాలైన భరతనాట్యం, మోహినియాట్టం ప్రత్యేకంగా ప్రదర్శించబడినవి.  

రాగమాలిక రాగంలో శ్రీ ఆదిశంకరాచార్య స్వరపరిచిన అర్ధనారీశ్వర స్తోత్రంకు సౌజన్య శ్రీనివాస్ చేసిన  భరతనాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన విద్వాన్ మంజు వి. నాయర్ గారు భరతనాట్యం ప్రదర్శన చేయగా, బెంగళూరుకు చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్రకుమార్ గారు మోహినియాట్టం ప్రదర్శన చేశారు. శివప్రసాద పంచకంకు శ్రీమతి మంజు నాయర్ గారు భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. 

ఫీనిక్స్ గ్రూప్‌కి చెందిన ఎమెరిటస్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం శాస్త్రీయ కళా వైభవానికి అద్దం పట్టింది.