సోషల్ మీడియాలో కేటీఆర్ పై సెటైర్లు

సోషల్ మీడియాలో కేటీఆర్ పై సెటైర్లు
  • వర్షాలు, యాదాద్రి రోడ్ల డ్యామేజ్ పై విమర్శలు
  • ఇటీవల ఏపీపై కేటీఆర్ కామెంట్లను తిప్పికొడుతున్న నెటిజన్లు

హైదరాబాద్, వెలుగు: ఒకవైపు భారీ వర్షాలతో హైదరాబాద్ తోపాటు యాదాద్రి, సిద్దిపేట జిల్లాలు అతలాకుతలమైతే.. మరోవైపు మంత్రి కేటీఆర్​ మాత్రం అన్నింట్లో మనమే నంబర్​ వన్​గా ఉన్నామంటూ చేసిన కామెంట్లు, కేసీఆర్ సర్కారు తీరుపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. సర్కారుపై నెటిజన్లు సోషల్​ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్​కు దిగారు. వేసవిలో కురిసిన వానకే ఇట్లా ఉంటే వర్షాకాలంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయో అని ఎద్దేవా చేశారు. 

ఏపీపై కేటీఆర్ కామెంట్లను గుర్తుచేస్తూ..

ఇటీవల క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ ఏపీపై వివాదాస్పద కామెంట్లు చేశారు. తన ఫ్రెండ్ ఏపీ వెళ్లి 4 రోజులు ఉండి ఇబ్బందులు పడి వచ్చాడని చెప్పారు. దీనిపై ఏపీ మంత్రులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో రోడ్ల డ్యామేజ్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, హైదరాబాద్​లో వరదల సమయంలో జరిగిన నష్టానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కేటీఆర్ సారీ చెప్పారు.

సోషల్​ మీడియాలో కొన్ని కామెంట్లు..

  • హైదరాబాద్ల వర్షాలు పడితే అసెంబ్లీ ముందు నీళ్లుంటాయి, సీఎం క్యాంప్ ఆఫీస్ ముందట కార్లు మునుగుతాయ్. వాటిని మంచిగా చేసి చూపిస్తా అని చెప్పినవ్. ఇగ మా గోస తీరినట్టే అని అనుకున్న జనంకు ఇగో ఇట్లా సుక్కల్ సూపిస్తున్నావ్ కదా కేసీఆర్. ఇదేనా నువ్ చేసిన విశ్వనగరం.
  • యాదాద్రి గుడి చుట్టూ భారీగా చేరిన నీరు. మోకాలు లోతు కుంగిన కొత్త రోడ్లు. అద్భుతమని ఆశ్చర్యపోతున్న ఇంజనీర్లు. ఈ ఘనత మన కేసీఆర్ వల్లనే సాధ్యమని అంటున్న నాయకులు. ఈ టెక్నాలజీ నేర్చుకుందామని హైదరాబాద్ రానున్న విదేశీ నిపుణల టీమ్.
  • సర్.. మొన్న వేరే స్టేట్ నుంచి వచ్చిన మీ ఫ్రెండ్ హైదరాబాద్ లోనే ఉన్నడా. ఇక్కడ కూడా బాలేదని వేరే స్టేట్ కు వెళ్లాడా.   
  • కేటీఆర్ గారు.. హైదరాబాద్ లో ఉండే మా ఫ్రెండ్ చెప్పాడు. నిన్న కురిసిన వర్షాలకు రోడ్లు కాస్తా చెరువులు అయ్యాయట కదా! నిజమేనా!  
  • మీ ఫ్రెండ్ ఇయాల పడ్డ వర్షానికి క్షేమంగా ఉన్నాడా. లేక నాలాలో కొట్టుకపోయాడా కేటీఆర్ గారు. 
  • హైదరాబాద్ లో రాత్రి కురిసిన వర్షానికి ఆంధ్ర నుంచి వచ్చిన కేటీఆర్ ఫ్రెండ్ బైక్
  • బంగారు తెలంగాణ ఇదే కదా! ఇదే నా మీ రాష్ట్ర డెవలప్ మెంట్. ఒక్క వర్షానికే చెరువులను తలపిస్తున్న హైదరాబాద్ రోడ్లు. రూ.1,200 కోట్లతో నిర్మించిన యాదాద్రిలో ఒక్క వానకే రోడ్లు కొట్టుకపోయినయి.