సర్కారీ దవాఖానలకు మెడిసిన్‌‌ తిప్పలు

సర్కారీ దవాఖానలకు మెడిసిన్‌‌ తిప్పలు
  •                 గతేడాది అప్పులే రూ.150 కోట్లు
  •                 ఈసారి బడ్జెట్‌‌లో రూ.106 కోట్లు కోత
  •                 ఏటా రూ. 300 కోట్ల వరకు అవసరం

 

రాష్ర్టం రోగాల కుప్పవుతోంది. సర్కారీ దవాఖాన్లకు రోగులు పోటెత్తుతున్నారు. మంచి వైద్యం అందిస్తున్నందుకే ఆస్పత్రులకు రోగులు పెరుగుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. కానీ మందుల కొనేందుకు మాత్రం తక్కువ పైసలిస్తోంది. ఇస్తున్న డబ్బులోనూ కోత పెడుతోంది. దీంతో మందులకు పైసలెట్లనో అర్థం కాక అధికారులు తల పట్టుకుంటున్నారు.

ఇంకో రూ. 80 కోట్ల బకాయిలు

రాష్ర్టంలోని ప్రభుత్వ దవాఖాన్లకు తెలంగాణ స్టేట్‌‌ మెడికల్ సర్వీస్‌‌ ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్‌‌‌‌ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌ మందులు సరఫరా చేస్తోంది. మందుల కొనేందుకు గతేడాది రూ.332 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం అందులో రూ.110 కోట్లే విడుదల చేసింది. దీంతో గతేడాది కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు ఈ ఏడాది బడ్జెట్‌‌లో రూ.106 కోట్లు కోత పెట్టి రూ.226 కోట్లే కేటాయించింది. వీటిలో ఈమధ్యే రూ.70 కోట్లు విడుదల చేస్తే పాత బకాయిలకు కట్టారు. ఇంకో రూ.80 కోట్ల బకాయిలున్నాయి. మందుల కొనేందుకు ఏటా సగటున రూ.300 కోట్లు అవసరం. ప్రభుత్వం ఈ యేడు మొత్తం నిధులిచ్చినా బకాయిలు పోను మిగిలేది రూ.76 కోట్లే. దీంతో ఈ సొమ్ముతో ఏడాదికి సరిపడ మందులెట్ల కొనాలో టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ అధికారులకు అర్థం కావడం లేదు. మరోచోట తగ్గించుకునైనా మందుల కొనేందుకు నిధులివ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 మంది పారామెడికల్‌‌ సిబ్బందిని కూడా సర్కారు భర్తీ చేయలేదు.

నిర్వహణ ఎవరిది?

సర్కారు దవాఖాన్ల మిషనరీ మెయింటెనెన్స్‌‌ను 2017లో ఫేబర్‌‌‌‌ సింధూరి సంస్థకు కట్టబెట్టిన ప్రభుత్వం.. 2 నెలల క్రితం ఆ సంస్థతో కాంట్రాక్టు రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయలేదు. అప్పట్లో రూ.180 కోట్ల విలువైన మిషనరీని ఆ సంస్థ మెయింటెయిన్ చేస్తుండగా రూ.130 కోట్ల విలువైన మిషనరీ బాధ్యతల నుంచి తప్పించారు. మరో రూ.50 కోట్ల విలువైన మిషనరీ రిపేర్ల బాధ్యతలనే చూస్తోంది. కానీ సగం కాంట్రాక్టు రద్దు చేయడంతో మొత్తం నిర్వహణను ఆ సంస్థ గాలికొదిలేసింది. దీంతో చిన్న రిపేర్లొచ్చినా డయాగ్నస్టిక్ యంత్రాలు మూలకు పడిపోతున్నాయి. సెక్రటేరియెట్‌‌ షిఫ్టింగ్‌‌తో ఫైల్‌‌ ఆగిందని, కాంట్రాక్టు టర్మినేషన్ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. పాత సంస్థను పూర్తిగా తప్పిస్తే గానీ కొత్త సంస్థకు పనులిచ్చే అవకాశం లేదు.