నామినేషన్లు వేయకుండా అడ్డంకులు

నామినేషన్లు వేయకుండా అడ్డంకులు
  • హుజూరాబాద్​ ఆర్డీవో ఆఫీస్ పరిసరాల్లో మోహరించిన పోలీసులు
  • ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వస్తారన్న సమాచారంతో అలర్ట్ 
  • వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పేరిట అభ్యర్థుల అడ్డగింత
  • నామినేషన్ పేపర్లు ఇవ్వకుండా ఇబ్బందులు 
  • టీఆర్​ఎస్​ ఆదేశాలతోనే పోలీసులు అడ్డుకుంటు న్నారని అభ్యర్థుల ఆగ్రహం


హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుని రాష్ట్ర సర్కార్​పై తమ నిరసన గళం వినిపించాలని నామినేషన్ వేసేందుకు వస్తున్న అభ్యర్థులను పోలీసులు మంగళవారం అడుగడుగునా అడ్డుకున్నారు. హుజూరాబాద్​ బస్టాండ్ ఏరియా నుంచి ఆర్డీవో ఆఫీసు వరకు ఒకవైపు రోడ్డంతా బ్లాక్ చేసి.. కఠిన ఆంక్షలు అమలు చేశారు. పోటీ చేయాలనుకుంటున్నవారికి వ్యాక్సిన్ డబుల్ డోస్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ.. బలపరిచే ఇద్దరు ఓటర్లకు కూడా సర్టిఫికెట్లు ఉండాలని కండిషన్ పెట్టారు. వ్యాక్సినేషన్ నిబంధన తెలియకపోవడంతో వచ్చినవాళ్లు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో వివిధ సంఘాలు, పార్టీల నాయకులతో పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉప ఎన్నికలో ఎక్కువ మంది నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకే టీఆర్​ఎస్​ ఆదేశాలతోనే పోలీసులు ఇలా చేస్తున్నారని అభ్యర్థులు మండిపడ్డారు. 


తమను ఉద్యోగాల నుంచి తీసేసినందుకు నిరసనగా హుజూరాబాద్ బై ఎలక్షన్​ లో వెయ్యి మందిమి పోటీ చేస్తామని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వంద మందిమి పోటీ చేస్తామని కళాకారులు, 200 మందిమి పోటీ చేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇప్పటికే హెచ్చరించారు. సోమవారం నామినేషన్ ఫామ్స్ తీసుకునేందుకు ఉపాధి హామీ  ఫీల్డ్ అసిస్టెంట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసుకు వెళ్లగా.. కరోనా రూల్స్ పాటించడం లేదనే సాకుతో పోలీసులు అరెస్ట్ చేసి సైదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంగళవారం మరికొందరు ఫీల్డ్​ అసిస్టెంట్లు రానున్నారనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  
16 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు వెనక్కి
మంగళవారం 16 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్‌‌ ఫామ్స్ నింపి, అఫిడవిట్స్ సిద్ధం చేసుకుని వెళ్లినప్పటికీ అవాంతరాలు తప్పలేదు.  వీరిలో ఆరుగురికి  డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేకపోవడంతో పోలీసులే వెనక్కి పంపారు. మరో పది మంది రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ వరకు వెళ్లినప్పటికీ.. బలపరిచే వ్యక్తులకు డబుల్ డోస్ సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపారు. దీంతో వారిలో ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. తమను ఉద్దేశపూర్వకంగానే పోలీసులు అడ్డుకుంటున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామలయ్య మండిపడ్డారు. 
నామినేషన్ ఫామ్స్ కోసం నిరీక్షణ
నామినేషన్ ఫామ్స్ కోసం ఎంసీపీఐ నాయకులు, ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) నాయకులు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుజూరాబాద్ కు చేరుకున్నారు. వారంతా ఆర్డీవో ఆఫీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫామ్స్ ఇస్తారని వెనక్కి పంపారు. వెయిట్ చేసిన  నాయకులు ఆ తర్వాత ఆఫీసు వద్దకు వెళ్లగా మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. అరగంట తర్వాత ఓ అధికారి వచ్చి నామినేషన్ ఫామ్స్ తెప్పిస్తామని చెప్పి లోపలికి వెళ్లిపోయారు. మరో అరగంట వెయిట్ చేసినా ఫామ్స్ ఇవ్వకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈలోగా మరో ఆఫీసర్ వచ్చి ఫామ్స్ అందుబాటులో లేవని, ఎన్నికల కమిషన్  వెబ్ సైట్  నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు.

నామినేషన్ ఫామ్స్ ఇవ్వలేరా ? 
పీఆర్సీలో తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా హుజూరాబాద్ బై పోల్​లో పోటీ చేయాలని హైదరాబాద్ నుంచి వచ్చాం. అఫిడవిట్స్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నం. నామినేషన్ ఫామ్స్ కోసం వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు ఆపి మధ్యాహ్నం 3.30 గంటలకు రమన్నరు. 3.30 గంటలకు వెళ్తే  మళ్లీ ఆపారు. ఫామ్స్ తెప్పిస్తామన్న ఎన్నికల అధికారులు.. తమ దగ్గర లేవని, వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని చేతులెత్తేశారు. కనీసం నామినేషన్ ఫామ్స్ కూడా అధికారులు ఇవ్వలేరా ? 
                                                                                                                         - రఘు సతీశ్​, అభ్యర్థి, టీఎస్ 61 ఎల్జిబుల్    రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్