‘ప్రైవేటు’లో టెస్టులకు పర్మిషన్ ఇస్తే ఇబ్బందులు

‘ప్రైవేటు’లో టెస్టులకు పర్మిషన్ ఇస్తే ఇబ్బందులు
  • అయినా, గైడ్​లైన్స్​ ఖరారుచేసి అనుమతిస్తం
  • ఐసీఎంఆర్‌‌ చెప్పినట్టే టెస్టులు చేస్తున్నం
  • కరోనా మరణాల సంఖ్య పెరగలేదు
  • రూల్స్​ కారణంగా అప్పుడు కొన్ని మరణాలు వెల్లడించలేదు
  • ఇప్పుడు మారిన విధానం ప్రకారం అన్నీ ప్రకటిస్తున్నం
  • ప్రైవేటులో ట్రీట్ మెంట్​కు చార్జీలు త్వరలో నిర్ణయిస్తం
  • కొందరు అవగాహనలేకనే అడ్డగోలుగా వాదిస్తున్నరు
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో హెల్త్​ మినిస్టర్​ ఈటల రాజేందర్​

ప్రస్తుతం గవర్నమెంట్‌‌ ల్యాబుల్లోనే  టెస్ట్ చేపిస్తున్నం. ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులకు పర్మిషన్ ఇస్తే ఇబ్బందులు వస్తయి. అక్కడ టెస్టు చేయించుకున్నవాళ్లకు పాజిటివ్ వస్తే.. వాళ్ల కాంటాక్ట్స్‌‌ వివరాలను ఎవరు ట్రేస్ చేయాలె? వాళ్లను హాస్పిటల్‌‌కు ఎవరు తీసుకురావాలె? టెస్టులు, ట్రీట్‌‌మెంట్ తప్ప ట్రేసింగ్, ఐసోలేషన్‌‌ వంటివన్నీ ప్రైవేటు వాళ్లు చేయలేరు. ఇలా ఇంకొన్ని సమస్యలున్నయి. వాటిని ఓవర్‌‌‌‌కమ్ చేసేందుకు విధివిధానాలు ఖరారు చేసి పర్మిషన్ ఇస్తం.

హైదరాబాద్, వెలుగుఅందరికీ టెస్టులు చేయలేమని, ఐసీఎంఆర్ సూచనల మేరకు అవసరమైనవాళ్లకే టెస్టులు చేపిస్తున్నామని హెల్త్​ మినిస్టర్​ ఈటల రాజేందర్​ అన్నారు. టెస్టుల విషయంలో చాలా మంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మరణాల ప్రకటనలోనూ ఐసీఎంఆర్  గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. ప్రైవేటు హాస్పిటల్స్‌‌లో కరోనా ట్రీట్‌‌మెంట్ చేయొద్దని తాము ఎప్పుడూ చెప్పలేదని, మొదటి నుంచి కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్​లో ట్రీట్‌‌మెంట్ ఇస్తున్నారని, ఇప్పుడు ప్రత్యేకంగా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇతర ఆరోగ్య సమస్యలకు ట్రీట్‌‌మెంట్ నిరాకరించొద్దని అన్ని హాస్పిటల్స్‌‌కు ఆదేశాలిచ్చామన్నారు. ఒకవేళ ఎవరికైనా వైరస్ లక్షణాలుంటే శాంపిల్స్​తీసి నిమ్స్‌‌కు పంపించాలని చెప్పినట్లు వెల్లడించారు.

బుధవారం మంత్రి ఈటల రాజేందర్​‘వెలుగు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు,  టెస్టులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.

వెలుగు: రాష్ట్రంలో కరోనా  కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నరు?

ఈటల : వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నం. ఎక్కువ కేసులు వస్తున్న దగ్గర స్పెషల్ ఆఫీసర్లను పెట్టినం. గ్రేటర్ హైదరాబాద్‌‌లోనే కొన్ని కేసులు వస్తున్నయి. అవి కూడా కొన్ని కుటుంబాల్లోనే ఎక్కువ నమోదైనయి. జిల్లాల్లో మైగ్రెంట్​ లేబర్ కేసులు తప్ప లోకల్‌‌గా వైరస్ వ్యాప్తి లేదు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నరు?

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవాళ్లను బార్డర్‌‌‌‌లోనే ఆపి, స్ర్కీనింగ్ చేపిస్తున్నం. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే టెస్టులు చేపిస్తున్నం. లేదంటే ఇంటికి పంపుతున్నం. ఇంట్లో క్వారంటైన్‌‌ సదుపాయం లేనోళ్లను గ్రామ పంచాయతీల్లో, కమ్యూనిటీ హాళ్లలో క్వారంటైన్‌‌ చేస్తున్నం. క్వారంటైన్‌‌లో ఉన్నోళ్లందరినీ ఆశ వర్కర్లు, ఏఎన్‌‌ఎంలు రోజూ మానిటర్ చేస్తున్నరు. ఎవరికైనా లక్షణాలొస్తే టెస్టులకు పంపిస్తున్నరు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్లలో ఇప్పటికే దాదాపు150 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

మన రాష్ట్రంలోనే తక్కువ టెస్టులు చేసినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.. దీనిపై మీరేమంటరు?

టెస్టుల విషయంలో చాలా మంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు. ఐసీఎంఆర్  సూచనల మేరకు అవసరమైన వాళ్లందరికీ టెస్టులు చేపిస్తున్నం. అందరికీ టెస్టులు చేయలేం. ఎవరికైనా పాజిటివ్ వస్తే వారి ఇంట్లో వాళ్లకు, హైరిస్క్‌‌ కాంటాక్ట్‌‌ వ్యక్తులందరికీ టెస్టులు చేపిస్తున్నం. సివియర్​అక్యుట్​రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ పేషెంట్లకు, ఇన్‌‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌‌నెస్‌‌ పేషెంట్లకు కూడా చేపిస్తున్నం.

సూర్యాపేట జిల్లాలో టెస్టులు ఎందుకు ఆపేశారని హైకోర్టు ప్రశ్నించింది కదా?

సూర్యాపేటలో వందల మందికి టెస్టు చేసి వైరస్​ను కంట్రోల్‌‌ చేసినం. ఇప్పుడు అక్కడ వైరస్  స్ర్పెడ్‌‌ లేదు. వైరస్ వ్యాప్తి ఉంటే ఇప్పటికీ వందల కేసులు వచ్చేవి కదా? మరణాలు వస్తుండె కదా? సూర్యాపేటలో టెస్టులు చేయకుండా గ్రీన్ జోన్ చేసినమంటూ కొందరు అవగాహన లేకుండా అడ్డగోలుగా
వాదిస్తున్నరు.

ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులకు అనుమతి ఇస్తరా?

ప్రస్తుతం గవర్నమెంట్‌‌ ల్యాబుల్లోనే  టెస్ట్ చేపిస్తున్నం. ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులకు పర్మిషన్ ఇస్తే ఇబ్బందులు వస్తయి. అక్కడ టెస్టు చేపించుకున్నవాళ్లకు పాజిటివ్ వస్తే.. వాళ్ల కాంటాక్ట్స్‌‌ వివరాలను ఎవరు ట్రేస్ చేయాలె? వాళ్లను హాస్పిటల్‌‌కు ఎవరు తీసుకురావాలె? టెస్టులు, ట్రీట్‌‌మెంట్ తప్ప ట్రేసింగ్, ఐసోలేషన్‌‌ వంటివన్నీ ప్రైవేటు వాళ్లు చేయలేరు. ఇలా ఇంకొన్ని సమస్యలున్నయి. వాటిని ఓవర్‌‌‌‌కమ్ చేసేందుకు విధివిధానాలు ఖరారు చేసి పర్మిషన్ ఇస్తం.

కరోనా మరణాలను దాచిపెడుతున్నట్లు విమర్శలు వస్తున్నయి కదా..?

మరణాలు‌‌ దాస్తే దాగేవి కాదు. దీర్ఘకాలం వేరే జబ్బులతో బాధపడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చి చనిపోయినా కరోనా కింద లెక్కగట్టొద్దని ఐసీఎంఆర్ సూచనలు చేసింది. మేం వాటినే ఫాలో అయినం. ఇప్పుడు రివైజ్డ్  గైడ్‌‌లైన్స్ ఇచ్చింది. వాటి ప్రకారం అన్ని కరోనా మరణాలను ప్రకటిస్తున్నం. కరోనా మరణాలు ఏమీ పెరగలేదు.

ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా ట్రీట్‌‌మెంట్‌‌ను చేరుస్తరా?

అలాంటి ఆలోచన చేయలేదు. ఇప్పుడు ట్రీట్‌‌మెంట్ మొత్తం ఫ్రీగానే ఇస్తున్నం. ఇంటి దగ్గర్నుంచి తీసుకొచ్చి, తిరిగి ఇంటి దగ్గర క్షేమంగా దింపుతున్నం.

సాధారణ జ్వరం ఉన్నా కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్‌‌లో ట్రీట్‌‌మెంట్ ఇవ్వడంలేదు. కరోనా టెస్టు చేయించుకోవాలని తిప్పి పంపుతున్నరు.. దీనిపై మీ స్పందన?

కరోనా టెస్టుల కోసం ఇతర ఆరోగ్య సమస్యలకు ట్రీట్‌‌మెంట్ నిరాకరించొద్దని అన్ని హాస్పిటల్స్‌‌కు ఆదేశాలిచ్చినం. ఫీవర్ ఓపీ కోసం స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించినం. ఒకవేళ ఎవరికైనా వైరస్ లక్షణాలుంటే శాంపిల్స్​తీసి నిమ్స్‌‌కు పంపించాలని చెప్పినం.