పంచాయతీ సెక్రటరీలకు యాప్​ల యాతన

పంచాయతీ సెక్రటరీలకు యాప్​ల యాతన
  • ట్యాబ్, ఫోన్, డాటా చార్జీలు ఇవ్వకుండా నిర్వహణ ఎలా?
  • ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడిలోఉన్నామని ఆవేదన
  • వాటి అమలు నుంచి తప్పించాలంటూ ఆందోళనలు

హైదరాబాద్, వెలుగు: పంచాయతీల్లో పనులు మరింత బాగా చేయడం, ప‌‌ర్యవేక్షణ కోసం పంచాయ‌‌తీరాజ్ శాఖ తయారు చేసిన రెండు‌‌ మొబైల్ యాప్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్, జూనియర్ పీఆర్ సెక్రటరీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్రు. ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లు ఇవ్వకుండా యాప్ ల నిర్వహణ ఎలా అని ప్రశ్నిస్తున్నరు. డ్యూటీలో చేరిన నాటి నుంచి వర్క్ ప్రెజర్‌తో ఇబ్బంది పడుతున్నామని, వందలాది మంది జాబ్ వదిలేశారని, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేస్తున్నరు. యాప్ ల బాధ్యతల నుంచి తమను తప్పించాలని కోరుతున్నరు. ఆందోళన చేపడుతుండటంతో పాటు అధికారులు వినతిపత్రాలు ఇస్తున్నరు.

రెండు యాప్ లు రిలీజ్​

పల్లె ప్రగతి – పీ.ఎస్. యాప్ (పంచాయ‌‌తీ సెక్రటరీ యాప్), పల్లె ప్రగతి – పర్యవేక్షణ యాప్ (ఇన్స్ పెక్షన్ ఆఫీసర్ యాప్)లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల రిలీజ్ చేశారు. పల్లె ప్రగతి – పీ.ఎస్. యాప్ లో రోజు వారి శానిటేషన్​ వర్క్స్, రోడ్లు, డ్రైనేజీలు, సర్కార్ ఆఫీసులు క్లీన్ చేయడం, ఇండ్ల నుంచి చెత్త తీసుకెళ్లడం, స్ట్రీట్ లైట్స్ మేయింటెనెన్స్ వివరాలు ఉన్నాయి. పీఎస్ యాప్‌‌లో సెక్రటరీ రిపోర్ట్​ చేసినవి.. డేటా చెక్ యాప్‌‌కు వెళ్తాయి. వీటిని చెకింగ్ ఆఫీసర్లు (ఎంపీవో, డీఎల్ పీవో, డీపీవో) సర్టిఫై చేస్తారు. ఒక వారంలో చెక్​చేయడం కోసం ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ లాగిన్ కు అప్ లోడ్ చేయాలని తెలిపారు.

యాప్‌ల అమలు, రిపోర్టులపై చర్యలకు చాన్స్

ఈ యాప్‌‌ల పర్యవేక్షణపై 11 మంది ఆఫీసర్లకు బాధ్యతలిస్తూ కమిషనర్ రఘనందన్ రావు ఇటీవల ఆర్డర్లు ఇచ్చారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించాలని పేర్కొన్నారు. ఈ యాప్ ల అమలు, సెక్రటరీలు అప్ లోడ్ చేసే రిపోర్టుల ఆధారంగా జూనియర్ సెక్రటరీలపై చర్యలు తీసుకునే చాన్స్​ఉన్నట్లు తెలుస్తోంది. 2018 లో మొత్తం 9,300 కు పైగా జూనియర్ సెక్రటరీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, డ్యూటీలో చేరిన నాటి నుంచి చాలా మంది జాబ్ కు రిజైన్ చేయటం, ఇతర జాబ్ లకు వెళ్లటంతో ఇప్పుడు 8 వేల మందే పనిచేస్తున్నారు. ఈ యాప్ లు అమలులోకి తెచ్చాక మరింత మంది రాజీనామా చేస్తారని పీఆర్ సెక్రటరీల సంఘం నేతలు చెబుతున్నారు.

15 వేలు ఇస్తూ 5 0వేల పని చేయించుకుంటున్రు

యాప్ ల అమలులో ఎన్నో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తయి. సర్కార్ ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ బిల్లు ఇవ్వకుండా మా సొంత ఫోన్లలో వీటితో పనులు చేయమంటే ఎట్ల. మా మండలంలో 5 ఊర్లలో సిగ్నల్స్ రావు. ఎట్ల చేయాలె. మాకు రూ. 15 వేలు జీతం ఇస్తూ రూ. 50 వేల పని చేయించుకుంటు న్రు. ఇప్పటికే పల్లె ప్రగతి, వైకుంఠధామం,  శానిటేషన్, ఆస్తుల సర్వే తో పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నం. ఇప్పుడు డైలీ రిపోర్టు లు అప్ లోడ్ చేయాలంటే మా వల్ల కాదు.

– ఓ మహిళ జూనియర్ పీఆర్​ సెక్రటరీ, నల్గొండ జిల్లా

ట్యాబ్, ఫోన్, డేటా  చార్జీలు ఎవరిస్తరు

రెండు యాప్ లతో పని చేయాలంటే ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లు, డేటా చార్జీలకు ఖర్చవుతుం ది. చాలా చోట్ల సిగ్నల్స్ రావట్లేదు. ఆస్తుల సర్వే టైమ్‌లో చాలా ఇబ్బంది పడ్డం.  సొంత ఫోన్​లో సర్కార్ పని ఎట్ల చేస్తం. జనాభా లెక్కలు చేసేప్పుడు కేంద్రం అన్ని సౌలత్​లు కల్పిస్తుంది. ఇక్కడ ఏం ఇవ్వకుండా ఎట్ల చేయాలి. గ్రౌండ్ లెవల్లో సమస్యలు తెలుసు కోకుండా యాప్ లు స్టార్ట్​ చేసిన్రు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.

– మధుసూధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు