చెన్నూరులో బీజేపీ నాయకులపై దాడి

చెన్నూరులో బీజేపీ నాయకులపై దాడి
  • కర్రలతో దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలు
  • దాడిలో గాయపడ్డ చెన్నూరు బీజేపీ ఇంచార్జీ అందుగుల శ్రీనివాస్
  • బాల్క సుమన్ అనుచరులే తమపై దాడికి దిగారని బీజేపీ ఆరోపణ

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి, చెన్నూరు పరిధిలో మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ నేతలపై దాడి జరిగింది. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ చెన్నూరు ఇంచార్జీ అందుగుల శ్రీనివాస్ చేతికి గాయాలయ్యాయి. ఆయన కారును టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం అందుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్ట్ రివర్స్ వాటర్ వల్ల దాదాపు 15 వేల ఎకరాల్లో పంట నష్టం కలుగుతోందని, ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా... పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంలోనే ఇక్కడి రైతుల సమస్యలను తెలసుకునేందుకు తాము వచ్చామని, అయితే టీఆర్ఎస్ గూండాలు తమపై దాడిగి దిగారని ఆయన ఆరోపించారు. స్థానిక కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీపీ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది టీఆర్ఎస్ గూండాలు తమపై కర్రలతో దాడికి దిగారన్నారు. తమను చంపడానికి వారు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తమపై దాడి జరిగిందని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు సమాచారం అందిస్తే వారు పట్టించుకోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాలతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు తమపైకి దాడికి దిగారని ఆరోపించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ గూండా రాజకీయాలకు పాల్పడుతున్నారని, తమపై దాడి చేయించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం...

చిన్నదొరకు తెలంగాణలో దోస్తులు లేరా?

సొంత పార్టీ మేయర్ పై తిరగబడ్డ టీఆర్ఎస్ కార్పొరేటర్