కోదండరామ్ ఎంట్రీతో అలర్టయిన టీఆర్ఎస్

కోదండరామ్ ఎంట్రీతో అలర్టయిన టీఆర్ఎస్
  • నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్​ భేటీ
  • ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని ఆదేశాలు
  • ఎమ్మెల్యే లందరికీ ఓటరు నమోదు బాధ్యతలు

నల్గొండ, వెలుగు: తమకు అచ్చిరాని గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్దగా ఇంట్రెస్ట్​ చూపని అధికార పార్టీ తాజాగా రూట్​మార్చింది. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్​నియోజకవర్గంపై టీఆర్ఎస్​స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఈ నియోజకవర్గం నుంచి టీజేఎస్​అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఒకవేళ ఆయన గెలిస్తే రాజకీయంగా తమకు ఎంతో కొంత మైనస్​ అని పార్టీ హైకమాండ్​ ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే టీఆర్ఎస్​కు సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మూడు జిల్లాలకు చెందిన మినిస్టర్లు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు.  కోదండరామ్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీటైన ఒకరిద్దరు అభ్యర్థుల పేర్లు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అభ్యర్థుల కంటే ముందుగా మెంబర్ షిప్ డ్రైవ్ పైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ మేరకు పాత ఓటరు లిస్టులను వారికి అందజేసి, ఆయా నియోజకవర్గాల్లోని వారిని సంప్రదించడంతో పాటు, కొత్త మెంబర్ షిప్ ఎన్​రోల్మెంట్ చేయాలని స్పష్టం చేశారు. దీంతో మూడు జిల్లాల్లోని ఎమ్మెల్యేలంతా మెంబర్​షిప్​ డ్రైవ్​ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే ఇప్పటికే మెంబర్​షిప్​ డ్రైవ్ స్టార్ట్ చేశారు.

మూడు లక్షలకు పైగా ఓటర్లు

2015 ఓటరు జాబితా  ప్రకారం మూడు జిల్లాల్లో మూడు లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో లక్షన్నర ఓట్లు మాత్రమే పోలయ్యా యి. గత జాబితా ఆధారంగానే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్​ ఓటర్లను ఎన్రోల్ చేయించేందుకు రెడీ అవుతున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల కమిషన్ ఓటరు నమోదుకు షెడ్యూల్ జారీ చేసే చాన్స్​ ఉంది. అప్పటిలోగా నియోజకవర్గాలవారీగా ఓటర్ల జాబితాను ప్రిపేర్ చేసి షెడ్యూల్ రాగానే ఎన్రోల్ చేయించాలి. దీనికి సంబంధించి భారీ కసరత్తే చేయాల్సి వస్తోందని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే మెంబర్ షిప్ డ్రైవ్ స్టార్ట్ చేశారు.

పోటీలో ఎవరు?

క్యాండిడేట్ల విషయం చర్చకు వచ్చినప్పుడు మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు తలోమాట చెప్పినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డినే తిరిగి నిలబెట్టాలని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. వరంగల్ నుంచి   ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేరును ఆ జిల్లా ప్రజాప్రతినిధులు ప్రతిపాదించినట్లు తెలిసింది. వీరే కాకుండా పోటీకి చాలామంది క్యూలో ఉన్నట్లు చెబుతున్నారు.

టీఆర్ఎస్కు సవాల్

ఈసారి జరగబోయే ఎన్నిక టీఆర్ఎస్ కు ముమ్మాటికీ సవాలే అని పొలిటికల్​అనలిస్టులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో అన్ని పక్షాల మద్దతు ఉన్నది కాబట్టి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు సులభమైంది. అదీగాక పల్లా విజయానికి విపక్షాల సపోర్ట్​తో పాటు , టీఆర్ఎస్​కు ఉద్యమ  నేపథ్యం కలిసి వచ్చింది.  కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవని అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్ కోదండరామ్ పోటీలో దిగితే  టీఆర్ఎస్​కు ఎదురీత తప్పదని విశ్లేషిస్తున్నారు. విద్యావంతులు, ని రుద్యోగులు, మేధావులు కోదండరామ్ వైపే మొగ్గుచూపే చాన్స్​ ఉందని, ఇటీవల ఇదే నియోజకవర్గానికి జరిగిన టీచర్ ఎమ్మె ల్సీ ఎన్నికే అందుకు నిదర్శమని అంటున్నారు.  ఈ క్రమంలోనే కోదండ రామ్​ను నిలువరించేందుకే టీఆర్ఎస్ మెంబర్ షిప్ డ్రైవ్​ను సీరియస్​గా తీసుకుంటోందని అంచనా వేస్తున్నారు.