టీఆర్ఎస్, బీజేపీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయి

టీఆర్ఎస్, బీజేపీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయి
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల: టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.  ఈ రెండు పార్టీల తీరు “నువ్వు కొట్టినట్లుగా చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా” అన్నట్లుంది అని ఆయన ఎద్దేశా చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మేథోమథన సదస్సు జరిగింది.  ఈ సదస్సులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తే బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఏర్పాటు చేసిన మీటింగ్ కు మేము హాజరయ్యామని, అయితే కేసీఆర్ ప్రతిపక్షాల ఐక్యతకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు. 
కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తాము రాలేదని చెప్పడం ఓ నాటకం అన్నారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించాలన్నదే కేసీఆర్ ఆలోచన అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం పెట్టిన ప్రతి బిల్లుకు మద్ధతు తెలిపింది కేసీఆర్  కాదా? అని ఆయన ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ బిల్లు, త్రిబుల్ తలాక్ వంటి అనేక బిల్లులకు టీఆర్ఎస్ మద్ధతిచ్చిందని గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్ లోని ప్రత్యేక పరిస్థితుల్లో వేర్పాటు వాదాన్ని నిర్మూలించేందుకు ఆర్టికల్ 370 ను తెస్తే మోడి దాన్ని తొలగించారని, ఆర్టికల్ 370 తొలగించడం వల్ల జమ్మూకాశ్మీర్ లో హింసాత్మక వాతావరణం నెలకొందని ఆరోపించారు. ముస్లింలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో వరికి మద్ధతు ధరను 600 నుంచి 1650కి పెంచితే... మోడీ ఎనిమిదేళ్ల హయాంలో కేవలం 500 మాత్రమే పెంచారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. 
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో చెరకు ఫ్యాక్టరీ తెరిపిస్తామని మొత్తానికే మూసేయించారు
సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ గురించి ప్రస్తావిస్తూ..  ‘దొరసాని ఏడుందోగానీ, అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామి ఇచ్చి.. అధికారంలోకి రాగానే మొత్తానికే మూసివేయించారు..చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసేందుకు, ఆస్తులను అమ్ముకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది.. కవితను ఓడగొట్టారని మాట్లాడుతుండ్రు. బరాబర్ ఓడగొడతాం.. నువ్వేం చేసినవని గెలిపించాలి..’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎవరైనా పార్టీ ఆదేశం మేరకు కార్యకర్తలు వారి గెలుపుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో అనుకున్న స్థాయిలో మనం పనిచేయడం లేదని గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పడు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మనం తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాల అమలుతీరును, ఇప్పడు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నపథకాల తీరును బేరీజు వేసుకోవాలని ప్రజలకు చెప్పాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా... పెట్రోలు, డీజిల్ ధరుల విపరీతంగా పెంచారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.