ప్రతి ఇంట్లో ఓ పార్టీ మెంబర్​…

ప్రతి ఇంట్లో ఓ పార్టీ మెంబర్​…
  • ఉద్యమ ముద్ర, ప్రమాద బీమా స్కీమ్​తో టీఆర్ఎస్
  • మోడీ వేవ్, యూత్​ మద్దతుతో బీజేపీ దూకుడు
  • వరుస దెబ్బలతో గందరగోళంలో కాంగ్రెస్
  • చడీచప్పుడు లేని టీడీపీ, లెఫ్ట్​

ఏ ఊర్లో చూసినా, వాడల్లో చూసినా ఓ టెంటు.. దాని కింద కొందరు జనం.. రంగు రంగుల జెండాలు, కండువాలు.. టేబుళ్లపై బుక్కులు.. ఫోన్లలో ముచ్చట్లు..రాష్ట్రంలో కొద్దిరోజులుగా రాజకీయ పార్టీల మెంబర్​షిప్​ డ్రైవ్​లతో కనిపిస్తున్న హడావుడి ఇది. ఒకప్పుడు సభ్యత్వ నమోదును నామమాత్రంగా నడిపించిన పార్టీలు.. ఇప్పుడు పోటాపోటీగా మెంబర్​షిప్​ కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రమాద బీమా కల్పిస్తమంటూ, కేవలం సెల్​ఫోన్​ నుంచి మిస్స్​డ్​ కాల్​ ఇస్తే చాలంటూ సభ్యత్వ నమోదు కోసం జనం వెంటపడుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ భారీగా సభ్యత్వాల నమోదుపై ఫోకస్​ పెట్టాయి. వరుసగా అన్ని స్థాయిల ఎన్నికలు ముగియడం, చివరిగా మున్సిపల్​ ఎలక్షన్లు వస్తుండటంతో పార్టీలను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. గతంలో కంటే మెంబర్​షిప్​ను పెంచుకోవాలని, 60 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న జోష్​తో ఉన్న బీజేపీ… మోడీ వేవ్, యూత్​ మద్దతుతో మెంబర్​షిప్​ను ఏకంగా రెట్టింపు చేసుకునే పనిలో పడింది. గతంలో ఉన్న 18 లక్షల సభ్యత్వాలను ఈసారి 36 లక్షలు దాటించే దిశగా గట్టిగా కృషి చేస్తోంది. వరుస ఎదురుదెబ్బలతో కుదేలైన కాంగ్రెస్​ పార్టీ మాత్రం సభ్యత్వ నమోదుపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. టీడీపీ, వామపక్షాల్లో కూడా ఏమాత్రం కదలిక కనిపించడం లేదు.

టీఆర్ఎస్ టార్గెట్ 60 లక్షలు

2001లో టీఆర్ఎస్ స్థాపించిన‌ప్పటి నుంచి సభ్యత్వ నమోదుపై పెద్దగా దృష్టిపెట్టలేదు. 2014లో అధికారంలోకి వ‌‌చ్చిన‌‌ప్పటి నుంచి మెంబర్​షిప్​ డ్రైవ్​ను సీరియస్​గా తీసుకుంది. రెండేళ్లకోసారి సభ్యత్వాన్ని చేప‌‌ట్టే టీఆర్ ఎస్ 2015–17, 2017–19 డ్రైవ్ లలో 70 లక్షల టార్గెట్​తో పనిచేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు మెంబర్ షిప్ డ్రైవ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని 46 లక్షల సభ్యత్వాలు నమోదు చేశారు. తాజాగా 2019–21 కోసం మెంబర్​షిప్​ డ్రైవ్​ నడుస్తోంది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్​లో కనీసం 50 వేల సభ్యత్వాలు చేయించాలని ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులకు టీఆర్ఎస్​ హైకమాండ్​ టార్గెట్​ పెట్టింది. మొత్తంగా ఈసారి టార్గెట్​ 60 లక్షలుగానే పెట్టుకుంది. గ‌‌తంలో ఉన్న జోష్​ ఈసారి కనిపించడం లేదు. అర్బన్​ ఏరియాల్లో మెంబర్​షిప్​కు ఆశించినంత స్పందన కనిపించడం లేదని పార్టీ వ‌‌ర్గాలు అంటున్నాయి. వాస్తవానికి మున్సిప‌‌ల్ ఎలక్షన్లు రానుండటంతో.. అర్బన్​ ఏరియాలపై ఎక్కువ ఫోకస్​ చేయాలని టీఆర్ఎస్​ హైకమాండ్​ ఆదేశించడం గమనార్హం.

నేతల మధ్య తగాదాలతో..

టీఆర్ఎస్​లో కొత్త-పాత నేతల మధ్య తగాదాలతో చాలాచోట్ల మెంబర్​షిప్​ డ్రైవ్​ మందకొడిగా సాగుతోంది. తాండూరు, నకిరేకల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలకు, తాజాగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే వర్గాలకు మధ్య విభేదాలు రోడ్డెక్కడంతో.. కేటీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. మొత్తంగా 60 లక్షల సభ్యత్వమేమోగానీ.. గతంలో చేసిన 46 లక్షల మెంబర్​షిప్​ కూడా కష్టమేమోనని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మోడీ వేవ్, నలుగురు ఎంపీలు గెలిచిన జోష్​తో బీజేపీ పట్టణ ప్రజలను, యువతను లాక్కుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రమాద బీమా ఇస్తూ..

టీఆర్ఎస్​లో సభ్యులుగా చేరేవారికి రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తుండటం మెంబర్​షిప్​ డ్రైవ్​లో కీలకంగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీమా ప్రీమియం పార్టీయే కడుతుందని, రెండేళ్లలో 1,331 మంది టీఆర్ఎస్ సభ్యుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా అందిందని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్​రెడ్డి చెప్పారు. గత మెంబర్​షిప్​ సమయంలో పార్టీ ఏటా రూ.12 కోట్లను బీమా ప్రీమియంగా చెల్లించిందని.. ఈసారి రూ.15 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

కాంగ్రెస్ లో స్పందన లేదు

నాలుగేళ్లకోసారి మెంబర్​షిప్​ చేపట్టే కాంగ్రెస్ 2018లో రాష్ట్రంలో 19 లక్షల మందికి సభ్యత్వం ఇచ్చింది. రాష్ట్ర విభ‌‌జ‌‌న‌‌కు ముందు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ 35 లక్షల వ‌‌ర‌‌కు సభ్యత్వ నమోదు చేయించేది. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక పొన్నాల ల‌‌క్ష్మయ్య పీసీసీ చీఫ్​గా ఉన్నప్పుడు 18 లక్షల మెంబర్​షిప్​లు జరిగాయి. వాస్తవానికి 2014 క‌‌న్నా ముందు కాంగ్రెస్ కు రెగ్యులర్​ ఓటు బ్యాంకు ఉండ‌‌టంతో మెంబర్​షిప్​ను సీరియ‌‌స్ గా తీసుకోలేదు. రాష్ట్రం ఏర్పాటయ్యాక మెంబర్​షిప్​లపై దృష్టి పెట్టినా పెద్దగా ఫలితం కనిపించలేదు. పార్టీలో జోష్ త‌‌గ్గిపోవ‌‌టం, ఓటు బ్యాంకు చెల్లాచెదురవడం, నేతల మధ్య విభేదాలు, పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు వంటివి మెంబర్​షిప్​లపై ఎఫెక్ట్​ చూపాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో టీడీపీ బ‌‌ల‌‌హీనప‌‌డినా ఆ పార్టీ కేడ‌‌ర్ ను కాంగ్రెస్​ ఆకర్షించలేకపోయింది.

టీడీపీ సభ్యత్వ నమోదే లేదు

ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ ఇప్పుడు పూర్తిగా బలహీనపడింది. రెండేళ్లకోసారి సభ్యత్వాన్ని చేప‌‌ట్టే టీడీపీ.. 2014లో రాష్ట్ర విభ‌‌జ‌‌నకు కొద్దినెల‌‌ల‌‌ ముందు ఉమ్మడి రాష్ట్రంలో మెంబర్​షిప్​ డ్రైవ్​ నిర్వహించింది. 70 లక్షల మందికి మెంబర్​షిప్​లు ఇచ్చింది. 2016లో తెలంగాణలో టీడీపీ 7 లక్షల మెంబర్​షిప్​ మాత్రమే నమోదైంది. తిరిగి 2018లో మెంబర్​షిప్​ డ్రైవ్​ నిర్వహించాలి. కానీ పార్టీ పూర్తిగా బ‌‌ల‌‌హీనప‌‌డ‌‌టంతో కార్యక్రమం చేపట్టలేదు. గ‌‌తంలో టీడీపీకి ఉన్న మెంబర్​షిప్​ అంతా అటు టీఆర్ఎస్​కు, ఇటు బీజేపీకి మళ్లింది.

డబుల్ టార్గెట్ తో బీజేపీ

లోక్ స‌‌భ ఎలక్షన్ల తర్వాతి ప‌‌రిణామాల‌‌తో బీజేపీలో దూకుడు బాగా పెరిగింది. రాష్ట్రంలో పట్టుపెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం టీఆర్ ఎస్ కు పోటీగా మెంబర్​షిప్​ నమోదు చేయాలని నిర్ణయించింది. బీజేపీకి ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో కొంతపట్టు ఉండగా.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆ పార్టీవైపు గాలి వీస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఎక్కువశాతం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ ఐదేళ్లకోసారి సభ్యత్వ నమోదు చేపడుతుంది. 2014-లో చేపట్టిన మెంబర్​షిప్​ డ్రైవ్​లో రాష్ట్రంలో 18 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఐదేళ్లు పూర్తికావడంతో ఇటీవలే మెంబర్​షిప్​ డ్రైవ్​ మొదలుపెట్టారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్​షా.. ఓ గిరిజన మహిళకు మెంబర్​షిప్​ ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసారి రాష్ట్రంలో 36 లక్షల మెంబర్​షిప్​లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా యూత్​లో ఉన్న క్రేజ్​తోపాటు టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్, టీడీపీలు బాగా బలహీనపడటాన్ని ఆధారంగా చేసుకుని.. భారీగా మెంబర్​షిప్​లు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

త్వరలో సభ్యత్వ నమోదు

‘పార్టీల్లో సభ్యుడికి గౌరవాన్ని తెచ్చింది టీడీపీ మాత్రమే. మొట్టమొదటి సారిగా ఇన్సూరెన్స్​ ద్వారా సభ్యులకు భద్రత ఇచ్చింది మా పార్టీనే. మెంబర్​షిప్​ డ్రైవ్​ అసెంబ్లీ ఎలక్షన్లతో వాయిదా పడింది. త్వరలోనే చేపడతాం.’’

–కొత్తకోట దయాకర్​రెడ్డి, టీడీపీ నేత

యూత్ అంతా బీజేపీ వైపే..

మోడీ రెండోసారి ప్రధాని కావడం, మా దగగ్ర ఎంపీ సీటును బీజేపీయే గెలవడంతో కరీంనగర్ లో యూత్ అంతా బీజేపీ వైపే ఉన్నరు. పార్టీలో కూడా
ఊపు వచ్చినట్టు కనిపిస్తుంది. మా ఏరియా యూత్ గతంలో టీఆర్ఎస్ మెంబర్ షిప్ తీసుకున్నం. ఈసారి అందరు బీజేపీలో చేరుదామని అనుకుంటున్నం.

– శ్రీనివాస్, మంకమ్మతోట, కరీంనగర్

బీమా ఉండటంతో తీసుకుంటున్నరు

టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నోళ్లకు రూ.2 లక్షల ప్రమాద బీమా ఉండటం గ్రామాల్లో చాలా మంది తీసుకుంటున్నరు. ఏడాది కింద మా లక్ష్మక్క
స్కూటీపై వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్  జరిగి చనిపోయింది. ఆమెకు టీఆర్ఎస్ మెంబర్ షిప్ ఉండటంతో వాళ్ల ఫ్యామిలీకి రూ.2 లక్షలు వచ్చినయి. – కుమార్, అంకిరెడ్డిపల్లి, చిన్నకోడూరు మండలం, సిద్దిపేట జిల్లా