
- ఇంకా 30 మంది కార్పొరేషన్ చైర్మన్లు, 11 మంది జడ్పీ చైర్పర్సన్లు,
- వందల మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు
- ఊరూరా తిరుగుతున్నరు.. ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి బతిమాలుతున్నరు
- సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు
పల్లా రాజేశ్వర్‍రెడ్డి.. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ టీఆర్‍ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ. నాలుగు పదవులు ఉన్న వ్యక్తి. డీమ్డ్ యూనివర్సిటీ, సొంత కాలేజీలు ఉన్నాయి. తన దగ్గరే వేలాదిమంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు, లెక్చరర్లు ఉన్నారు. వీటికితోడు సీఎం కేసీఆర్‍కు సన్నిహితుడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్లే. దీంతో ఈసారి కూడా తిరిగి అదే స్థానం.. అదే పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పల్లా నిలిచారు. కామన్‍గా అయితే.. ‘ఈజీగానే గెలిచేస్తారు..’ అనుకుంటారు. కానీ పరిస్థితులు అట్ల లేవు. వేలమందితో కూడిన గులాబీ సైన్యం ఊరూరూ వాడవాడా తిరుగుతున్నా లీడర్లలో ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లే. ఎలక్షన్ డేట్ దగ్గరపడుతున్నకొద్దీ వారిలో టెన్షన్ మరింత ఎక్కువవుతోంది. దీంతో టీఆర్‍ఎస్ హైకమాండ్.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లను ఇలా ప్రతి ఒక్కరినీ రంగంలోకి దింపింది.
వరంగల్ రూరల్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‍రెడ్డి కోసం టీఆర్‍ఎస్ బలగం మొత్తం ఎన్నికల ప్రచారంలో తిరుగుతోంది. కార్యకర్తలు, చోటా మోటా నాయకులే కాదు.. నలుగురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు, 30 మంది కార్పొరేషన్ చైర్మన్లు, 11 మంది జడ్పీ చైర్మన్లు, వందల మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ఆయన గెలుపు కోసం కష్టపడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
పదవున్నోళ్లందరికీ ‘పల్లా’ డ్యూటీలే
పల్లా పోటీ చేస్తున్న ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు పరిధిలో 11 జిల్లాలు, 34 ఎమెల్యే స్థానాలున్నాయి. ఇందులో 29 ఎమ్మెల్యే సీట్లు టీఆర్ఎస్వే. ఉమ్మడి వరంగల్‌లో12 స్థానాలకు 11 మంది అధికార పార్టీకి చెందినవారే. ఖమ్మంలోని పది మందిలో ఏడుగురు వాళ్లే. నల్గొండలోని 12 స్థానాల్లో 11 మంది ఎమ్మెల్యేలది గులాబీ పార్టీయే. వీరిలో వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్, నల్గొండ నుంచి జగదీశ్‍రెడ్డి, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్.. కేసీఆర్ సర్కార్‍లో మినిస్టర్లుగా ఉన్నారు. ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలోని ఐదుగురు ఎంపీల్లో నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, పసునూరి దయాకర్ టీఆర్‍ఎస్ వాళ్లే. మరో 9 నుంచి10 మంది ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీ వాళ్లే. 11 మంది జడ్పీ చైర్మన్లు గులాబీవాళ్లే. 20 నుంచి 30 మంది వరకు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఇప్పుడు వీరందరి కామన్ డ్యూటీ పల్లా సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవడమే! అందుకే పొద్దున లేచింది మొదలు కాళ్లకు బలపాలు కట్టుకొని, గ్రాడ్యుయేట్ల అడ్రస్లిస్టు పట్టుకొని గడపగడప తిరుగుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు అంతా ప్రచారంలో మునిగిపోయారు.
ఏ మూలో డౌట్ కొడుతోంది!
పల్లా రాజేశ్వర్‍రెడ్డికి నాలుగు పదవులున్నా.. పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్‍వన్ అని చెప్పినా.. వందలాది పెద్ద లీడర్లు ప్రచారం చేసినా.. టీచర్లు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వ్యతిరేకత మాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా రాజేశ్వర్‍రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాక ఆయన సొంత బిజినెస్‌లు చూసుకోవడం తప్ప ఏనాడూ గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోలేదని, ప్రభుత్వ విద్యాభివృద్ధికి, కేయూలాంటి యూనివర్సిటీల డెవలప్మెంట్కు కృషి చేయలేదనే విమర్శలున్నాయి. పల్లా వ్యక్తిగతంగా అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్అధిపతిగా ఉండడమేగాక, సిట్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, టీఆర్‍ఎస్ జనరల్ సెక్రటరీగా, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా, పెన్షన్లు ఇస్తున్నామని పదేపదే టీఆర్‍ఎస్ లీడర్లు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయినా ఉద్యోగులు, నిరుద్యోగులు, టీచర్లలో పల్లాపై వ్యతిరేకత రోజురోజుకు మరింత పెరుగుతోంది తప్పితే తగ్గట్లేదని టీఆర్‍ఎస్ లీడర్లు కూడా అంటున్నారు. గతంలో కేయూ స్టూడెంట్ యూనియన్లు ఇదే విషయమై పల్లాతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావును అడ్డుకొని నిరసన తెలిపారు. ప్రచారంలో భాగంగా మూడు రోజుల కింద టీఆర్‍ఎస్ పార్టీకి చెందిన ఓ లీడర్.. ఎమ్మెల్సీగా ఏమీ చేయలేదంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని
బహిరంగంగానే నిలదీశారు.
గతంలో చాలా దగ్గరోళ్లు ఓడిండ్రనే టెన్షన్
టీఆర్‍ఎస్ లీడర్లను ఓటమి భయం వెంటాడుతోంది. పార్టీకి, సీఎం కేసీఆర్ కుటుంబానికి దగ్గరివారే గతంలో వివిధ ఎన్నికల్లో ఓడారనే టెన్షన్ వాళ్లను వేధిస్తోంది. ఎంపీ ఎలక్షన్లలో నిజామాబాద్, కరీంనగర్ టీఆర్‍ఎస్ అభ్యర్థులుగా ఓవైపు సీఎం కేసీఆర్ కూతురు కవిత, మరోవైపు బంధువు బోయినపల్లి వినోద్‍కుమార్ ఓటమిపాలయ్యారు. తమకు ఎదురేలేదని భావించే టైంలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్లు పరాభవం చెందడం, దానికి తోడు నిన్నగాక మొన్న ఏకంగా సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు నియోజకవర్గాల మధ్యలో ఉండే దుబ్బాక సీటును కూడా పార్టీ కోల్పోవడంతో పార్టీ లీడర్లలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ మూడ్ నుంచి బయటపడక ముందే జీహెచ్‍ఎంసీ ఫలితాలు మరోసారి వాళ్లను తీవ్రంగా నిరాశ పరిచాయి. పల్లా రాజేశ్వర్‍రెడ్డి కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకి దగ్గరివారు. ఆయనను ఎట్లయినా గెలిపించుకోవాలని గులాబీ బలగం ముందుకు పోతోంది.