టీఆర్ఎస్ కు సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే వ్యతిరేకత

టీఆర్ఎస్ కు సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే వ్యతిరేకత
  • సమస్యలు పరిష్కరించట్లేదంటూ కౌన్సిలర్ల నిరసన
  • మెదక్​, పెద్దపల్లి సమావేశాలను బాయ్​కాట్​ చేసిన టీఆర్​ఎస్​ కౌన్సిలర్లు


మెదక్​టౌన్​ / పెద్దపల్లి, వెలుగు: అధికార పార్టీ టీఆర్​ఎస్​కు సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే వ్యతిరేకత ఎదురైంది. చిన్న చిన్న సమస్యలనూ పరిష్కరించడం లేదంటూ మంగళవారం నిర్వహించిన మెదక్​, పెద్దపల్లి మున్సిపాలిటీల జనరల్​ బాడీ మీటింగుల్లో మండిపడ్డారు. కొందరు కౌన్సిలర్లు సమావేశాన్ని బాయ్​కాట్​ చేశారు. మెదక్​ మున్సిపాలిటీ చైర్​పర్సన్​ చంద్రపాల్​ అధ్యక్షతన సర్వసభ్య సమావేశంలో 9, 19, 28వ వార్డుల కౌన్సిలర్లు కల్యాణి, రుక్మిణి, మమతలు మాట్లాడారు. తమ వార్డుల్లోని సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా పాలకవర్గం, అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. వార్డుల్లో జరిగే కార్యక్రమాల గురించి కనీస సమాచారం ఇవ్వట్లేదన్నారు. సమావేశాన్ని బాయ్​కాట్​ చేసి వెళ్లిపోయారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రతి సమావేశంలో అనుకుంటున్నా ఏమీ చేయలేకపోతున్నామని కృష్ణారెడ్డి అనే కౌన్సిలర్​ వాపోయారు. ఈ క్రమంలోనే చైర్​పర్సన్​ చంద్రపాల్​, కృష్ణారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. సమస్యల గురించి చెప్తే చూస్తాం..చేస్తాం అంటున్నారే తప్ప పట్టించుకోవట్లేదని మరో కౌన్సిలర్​ మేఘమాల మండిపడ్డారు. 

తన వార్డుకు నిధులివ్వట్లేదని కాంగ్రెస్​ కార్పొరేటర్​ రాజలింగం అనే కౌన్సిలర్​ ప్రశ్నించారు. అవుసులపల్లిలో ఇండ్లు కట్టుకునేందుకు, కూల్చేందుకు ఆఫీసర్లు అనుమతులివ్వట్లేదని విశ్వం అనే కౌన్సిలర్​ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపించొద్దని మామిళ్ల ఆంజనేయులు అనే కాంగ్రెస్​ కౌన్సిలర్​ కోరారు. మిషన్​ భగీరథ కోసం రోడ్లపై తవ్విన గుంతలను పూడ్చేందుకు నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా మున్సిపల్​ వైస్​చైర్మన్​ మల్లికార్జున్​గౌడ్​ కోరారు. ఆ తర్వాత మాట్లాడిన చైర్మన్​ చంద్రపాల్​.. మూడో విడత పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని సూచించారు.  

తాగేనీళ్లూ ఇస్తలేరు 

పెద్దపల్లిలో కనీస సౌలతులు కల్పించడంలో మున్సిపల్​ పాలకవర్గం ఫెయిల్​ అయిందంటూ టీఆర్​ఎస్​ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగే నీళ్లూ కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. మున్సిపల్​ చైర్​పర్సన్​ దాసరి మమతా రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైన కాసేపటికే 17, 18 వార్డుల కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్​, సంధ్యలు తమ వార్డుల్లోని సమస్యలను ప్రస్తావించారు. మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న నీళ్లను సీసాల్లో పట్టుకొచ్చి.. ఈ నీళ్లను జనం ఎట్లా తాగుతారంటూ నిలదీశారు. కలుషిత నీళ్లు వస్తున్నాయని చెప్పినా పాలకవర్గంగానీ, అధికారులుగానీ పట్టించుకోవట్లేదంటూ మండిపడ్డారు. పట్నంలో తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య తీవ్రమైందని ఎన్నిసార్లు మొత్తుకున్నా పరిష్కరించట్లేదని ఫైర్​ అయ్యారు. తెనుగువాడలోని హిందూ శ్మశానవాటిక గోడను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకు మున్సిపాలిటీ త్వరలోనే మూల్యం చెల్లిస్తుందని కొలిపాక శ్రీనివాస్​ హెచ్చరించారు. కౌన్సిల్​లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సమావేశాల్లో చర్చించని వాటిపైనా తీర్మానాలు చేసి అమలు చేస్తున్నారని ఆరోపించారు. వివక్ష లేకుండా అన్ని వార్డులకు సమానంగా నిధులివ్వాలని, మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ ఇద్దరు కౌన్సిలర్లు సమావేశాన్ని బాయ్​కాట్​చేశారు. సమావేశం జరుగుతుండగానే తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై జనాలు మున్సిపాలిటీ ఆవరణలో ఆందోళనకు దిగారు. కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు వచ్చారు. వారితో ప్రజలు వాగ్వాదానికి దిగారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

సెల్​ఫోన్​ లైట్లు పెట్టుకుని అంత్యక్రియలు

భగీరథ పైప్​లైన్లలో సమస్యలతోటి మా వార్డులో నీళ్లొస్తలేవు. ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. శ్మశానవాటికలో ఒక్క లైట్ లేదు. కనీసం కరెంట్ ​​కనెక్షన్​ ఇస్తే లైట్లన్నా పెట్టుకుంటమని చెప్పినా పట్టించుకుంటలే. రాత్రి పూట సెల్​ఫోన్​​ లైట్లతో అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది. మున్సిపల్​ మీటింగుల్లో ప్రజా సమస్యలను చెప్పనిస్తలేరు.  
‌‌‌‌‌‌‌‌- శివునూరి మమత, 28వ వార్డు కౌన్సిలర్​, మెదక్​​

చిన్న పనులూ చేయలేకపోతున్నం

మెదక్​లో మా వార్డు చిన్నది. కౌన్సిలర్​గా ఉండి కూడా చిన్నచిన్న పనులూ చేయించలేకపోతున్నం. మున్సిపల్​ చైర్మన్​గానీ, అధికారులుగానీ సమస్యలను పరిష్కరించట్లేదు. వర్షాలు పడితే రోడ్లపై నీళ్లు నిలిచి జనం నడవలేకపోతున్నరు. మేమే సొంతంగా మ్యాన్​ హోల్స్​ను ఏర్పాటు చేయించినం. మిషన్​ భగీరథ కోసం తవ్విన గుంతలకు ఇప్పటికీ ప్యాచ్​వర్క్​లు చేయలేదు. సీసీ రోడ్లు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. కరెంట్​ సమస్యలనూ తీర్చట్లేదు.  
- బొద్దుల రుక్మిణి, 
19వ వార్డు కౌన్సిలర్​, మెదక్​​

చెప్పాపెట్టకుండా చెట్లు కొట్టేశారు

చెప్పాపెట్టకుండానే మా వార్డులోని చెట్లను కొట్టేశారు. ఎందుకు నరికారు? ఎవరు కొట్టేశారు? అని అడిగితే సమాధానం చెప్పట్లేదు. చెట్లు కొట్టేసినోళ్లపై కనీసం చర్యలూ తీసుకోలేదు. లేబర్​ అడ్డాను మార్చాలని చెప్పినా వినట్లేదు. ఆజంపుర పార్కింగ్  స్థల సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవట్లేదు.  
- మేడి కల్యాణి, 
  9వ వార్డు కౌన్సిలర్​, మెదక్