కారెక్కిన ఎమ్మెల్యేలదే హవా

కారెక్కిన ఎమ్మెల్యేలదే హవా

ఎమ్మెల్యేలకే క్యాండిడేట్ల ఎంపిక బాధ్యత
తమ అనుచరులవైపే మొగ్గు
తమ పరిస్థితి ఏమిటంటున్న సీనియర్లు
టికెట్​ దక్కకుంటే రెబల్​గా నిలిచేందుకు రెడీ
వలస ఎమ్మెల్యేలున్న 14 మున్సిపాలిటీల్లో పాతవాళ్లకు ఇబ్బందులు

(వెలుగు నెట్వర్క్టీఆర్ఎస్​లో పాత, కొత్త లీడర్ల జగడాలు మరోసారి ముదురుతున్నాయి. కాంగ్రెస్​ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలున్న సెగ్మెంట్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో టికెట్ల కోసం లొల్లి మొదలైంది. మున్సిపోల్స్​లో క్యాండిడేట్ల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలకే అప్పజెప్పడం, వలస వచ్చిన ఎమ్మెల్యేలు తమ అనుచరులకు టికెట్లు ఇచ్చుకునేందుకు ప్రయత్నించడం వివాదం రేపుతోంది. తమ వర్గాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం లేకపోవడంతో ముందు నుంచీ టీఆర్ఎస్​లో కొనసాగుతున్న సీనియర్లు రగలిపోతున్నారు. తమవారికి టికెట్లు ఇప్పించుకునే పరిస్థితి లేక, సర్ది చెప్పలేక సతమతమవుతున్నారు. టికెట్లు దక్కే చాన్స్​లేనివారు ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు. రెబల్స్​గా పోటీ చేసేందుకు ఏర్పాట్లు
చేసుకుంటున్నారు.

2018 ఎలక్షన్లలో కాంగ్రెస్​ నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి (తాండూర్),  సుధీర్‌‌రెడ్డి (ఎల్బీనగర్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం),- బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), -చిరుమర్తి లింగయ్య (నకిరేకల్),- -రేగా కాంతారావు(పినపాక), వనమా వెంకటేశ్వర్‌‌రావు (కొత్తగూడెం), బానోత్ హరిప్రియ (ఇల్లందు), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్),- జాజాల సురేందర్ (ఎల్లారెడ్డి), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి) టీఆర్ఎస్​లో చేరారు. రామగుండంలో ఫార్వర్డ్​బ్లాక్​తరఫున గెలిచిన కోరుకంటి చందర్​ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆత్రం సక్కు పరిధిలో ఆసిఫాబాద్​లో, సుధీర్​రెడ్డి పరిధిలోని ఎల్బీనగర్​లో మున్సిపల్​ ఎలక్షన్లు లేవు. మిగతా నియోజకవర్గాల్లో 3 కార్పొరేషన్లు, 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 14 చోట్లా టీఆర్ఎస్​ క్యాండిడేట్ల ఎంపిక బాధ్యతలు వలస ఎమ్మెల్యేల చేతిలోకే వెళ్లాయి. దీంతో అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలకు మింగుడు పడడంలేదు.

14 చోట్లా లొల్లే..

నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో క్యాండిడేట్లను ఎంపికపై వలస ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే తన అనుచరులకు టికెట్లు ఇచ్చుకుంటే జూపల్లి వర్గం తిరుగుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ, పరిషత్​ ఎన్నికల్లో ఇదే జరిగింది. ఇరువర్గాలకు టికెట్లు పంచినా రెబల్స్ ను రంగంలోకి దింపి, పార్టీ అభ్యర్థులను ఓటమికి కారణమయ్యారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇరువర్గాలు విడిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో వలస ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది.  కొత్తగూడెం మున్సిపాలిటీలో వెంకట్రావు వర్గాన్ని ఎమ్మెల్యే వనమా దూరం పెడుతున్నారు. దీంతో జలగం వర్గీయులు అనధికారికంగా సీపీఐ, కాంగ్రెస్​తో జతకట్టి ఎన్నికల బరిలో నిలిచేలా ప్లాన్​ చేసుకుంటున్నారు.

ఇల్లందులో కాంగ్రెస్​ నుంచి గెలిచి, టీఆర్ఎస్​లో చేరిన బానోత్ హరిప్రియ.. మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య వర్గాన్ని దూరం పెడుతున్నారనే విమర్శలున్నాయి. కనకయ్య వర్గానికి చెందిన వెంకట్ గౌడ్, ఆయన భార్య, మున్సిపల్ మాజీ చైర్​పర్సన్​ మడత రమ స్వతంత్ర అభ్యర్థులుగా సొంత ప్యానెల్​ను బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నారు.

వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​లోకి వచ్చారు. ఆయనకు, ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డికి మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాల్లో మహేందర్ రెడ్డి పాల్గొనడం లేదు. తాండూరు మున్సిపాలిటీ టికెట్ల పంచాయితీ నెలకొంది. ఎమ్మెల్సీ వర్గీయులకు టికెట్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యే సుముఖంగా లేరని వార్తలు వస్తున్నాయి.  ఎమ్మెల్యే వర్గానికి చెందిన దీప నర్సింహులును చైర్​పర్సన్​ అభ్యర్థిగా తెరపైకి తేవడాన్ని ఎమ్మెల్సీ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్లో ప్రస్తుత ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్యే  ఏనుగు రవీందర్​రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్  నుంచి గెలిచిన సురేందర్​ టీఆర్ఎస్​లో చేరినప్పటి నుంచి పార్టీలో రెండు వర్గాలు తయారయ్యాయి. ప్రస్తుతం ఎల్లారెడ్డి  మున్సిపాలిటీ టికెట్ల కేటాయింపు బాధ్యతలు సురేందర్​ చేతిలో ఉండటంతో తమకు టికెట్లు వస్తాయో, రావోనని రవీందర్​రెడ్డి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సురేందర్​ మాటే చెల్లుబాటైందని అంటున్నారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుంచి ఆలిండియా ఫార్వర్డ్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ అభ్యర్థిగా గెలిచిన కోరుకంటి చందర్‌‌‌‌  తర్వాత టీఆర్ఎస్​లో చేరారు. ఆయన రామగుండం కార్పొరేషన్‌‌‌‌  టికెట్ల కేటాయింపులో తన అనుచరులకే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారని ఇతర సీనియర్లు మండిపడుతున్నారు. సోమవారం12, 13 డివిజన్లలో తన అనుచరుల తరపున కోరుకంటి చందర్‌‌‌‌ ప్రచారం చేపట్టారు. దీంతో కొందరు టీఆర్ఎస్​ నేతలు రెబల్​గా నిలిచేందుకు రెడీ అవుతున్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు, మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గీయులకు మధ్య చిట్యాల మున్సిపాలిటీలో రసవత్తర పోరు సాగుతోంది. ఈ రెండు వర్గాలతో పాటు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి సైతం చిట్యాల మున్సిపాలిటీని టార్గెట్ చేశారు. ఇది జనరల్​కు రిజర్వ్​ కావడంతో మూడు వర్గాల మధ్య  టికెట్ల పంచాయితీ మొదలైంది.  చిరుమర్తి వర్గానికి వ్యతిరేకంగా వీరేశం అనుచరులు,  కృష్ణారెడ్డి టీమ్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది.

భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్​లో చేరారు. ఈ మున్సిపాలిటీ నుంచి పోటీకి రమణారెడ్డి అనుచరులు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి వర్గీయులు ఆసక్తి చూపుతున్నారు. రెండు వర్గాల మధ్య పోరు ఉండడం, ఎమ్మెల్యే తన అనుచరులకే టికెట్లిచ్చే చాన్స్​ నేపథ్యంలో హైకమాండ్​ నిర్ణయం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలో తుక్కు గూడ, జల్ పల్లి మున్సిపాలిటీలు, మీర్ పేట, బడంగ్​పేట కార్పొరేషన్లు ఉన్నాయి. మహేశ్వరంలో కాంగ్రెస్​ తరఫున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. తర్వాత టీఆర్ఎస్​లో చేరారు. దీంతో ఈ నాలుగు చోట్ల టికెట్ల కోసం మంత్రి, టీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వర్గాల నడుమ పోటీ నెలకొంది. సబిత అనుచరులకే టికెట్లు దక్కే అవకాశముండడంతో తీగల వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.

మేడ్చల్ జిల్లాలోనూ టీఆర్ఎస్​ కొత్త, పాత నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవల జవహర్​నగర్​లో ఎన్నికల సన్నాహక సభావేదికపైనే మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. టికెట్లపై ఆశలు పెట్టుకోవద్దనే సంకేతాలు వస్తుండడంతో సుధీర్​రెడ్డి వర్గం అసహనంతో ఉంది. మొదట టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి తర్వాత టీఆర్ఎస్ లో చేరి, గత ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచారు.

కుత్బుల్లాపూర్  సెగ్మెంట్​ పరిధిలోని మున్సిపాలిటీల్లోనూ ఎమ్మెల్యే వివేకానంద, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వర్గాల మధ్య పొసగడం లేదు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన వివేకానంద తర్వాత గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం ఎవరికివారు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో వర్గపోరు
తీవ్రమవుతోంది.