పోల్​ మేనేజ్​మెంట్​పై టీఆర్​ఎస్​ నజర్

 పోల్​ మేనేజ్​మెంట్​పై టీఆర్​ఎస్​ నజర్
  • ప్రగతి భవన్​ ఆదేశాలతో రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు
  • ఓటుకు 2 వేల నుంచి 20 వేల దాకా పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు
  • 50 మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జ్​.. గిఫ్టులు, మనీ, మందు, విందులు!
  • రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో మోహరించిన గులాబీ దండు
  • ఇతర ప్రాంతాల్లోని ఓటర్ల కోసం ఏసీ బస్సులు, కార్లు

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​కు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో పోల్​ మేనేజ్​మెంట్​పై టీఆర్​ఎస్​ స్పెషల్​ నజర్​ పెట్టింది.  తమ మంత్రులను, ఎమ్మెల్యేలను, కేడర్​ను రంగంలోకి దింపింది. ఎన్నికలు జరుగుతున్న రెండు గ్రాడ్యుయేట్​ నియోజకవర్గాల్లోని ఓటర్ల ఇండ్ల చుట్టూ  గులాబీ లీడర్లు కలియ తిరుగుతున్నారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కొన్ని చోట్ల బహిరంగంగానే డబ్బులు పంచుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఫోన్​ పే, గూగుల్​ పే ద్వారా మనీ ట్రాన్స్​ఫర్​ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.  హైదరాబాద్​ వంటి సిటీల్లో అపార్ట్ మెంట్లలోని ఓటర్లను ఓ గ్రూపుగా చేసి, వారికి  ఖరీదైన మందుతోపాటు విందులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియగానే పోల్​మేనేజ్​మెంట్​పై దృష్టి పెట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్​ వర్గాలు ఆదేశించినట్లు సమాచారం.  దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన ఏరియాల్లోని లోకల్​ లీడర్లకు ఎప్పటికప్పుడు డైరెక్షన్లు ఇస్తూ.. ఓటర్లను ఎలా తమ దిక్కు తిప్పుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు టీఆర్​ఎస్​లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ తీరుపై ప్రతిపక్ష పార్టీల లీడర్లు, ఇండిపెండెంట్లు మండిపడుతున్నారు. టీఆర్​ఎస్​ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఎన్నికలు కట్టుదిట్టంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం చీఫ్​ ఎలక్టోరల్​ ఆఫీసర్​ (సీఈవో)కు బీజేపీ ఫిర్యాదు చేసింది. టీఆర్​ఎస్​ లీడర్లు మందు, డబ్బులు పంపిణీ చేస్తున్నారని, అధికారులను మంత్రులు బెదిరిస్తున్నారని, ఎన్నికల్లో దొంగ ఓట్లు పడేలా చూస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రచారం ముగిసిన వెంటనే మంత్రులు, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్  వర్గాలు ఫోన్ చేసి పోల్ మేనేజ్​మెంట్​పై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. ప్రచారం ముగిసిన తర్వాత సొంత జిల్లాలు, నియోజకవర్గాలకు వెళ్లేందుకు రెడీ అయిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రగతిభవన్​ వర్గాల ఆదేశాలతో పోల్ మేనేజ్​మెంట్  వైపు ఫోకస్​ పెట్టారు. ఇప్పటికే 50 మంది ఓటర్లకు ఓ ఇన్​చార్జ్​ని నియమించిన టీఆర్ఎస్..  పోల్ మేనేజ్​మెంట్ బాధ్యతలనూ వారికే అప్పగించినట్టు తెలిసింది. ఈ ఇన్​చార్జులు తమకు అప్పగించిన ఓటర్లతో  టచ్​లో ఉంటున్నారు. పోలింగ్ బూత్ కు ఓటర్లు వెళ్లే వరకు వారితో మాట్లాడుతున్నారు.  గిఫ్టులు, డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గంలోని ఓటర్లకు నేరుగా ఫోన్ చేసి, తమ అభ్యర్థులకు ఓటు వేస్తే తాము ఇచ్చే ఆఫర్లను వివరిస్తున్నట్టు టీఆర్ఎస్  లీడర్లు మాట్లాడుకుంటున్నారు. 
రూ. 5 వేల నుంచి 20 వేల వరకు మనీ
తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే ఏరియాను బట్టి రూ. 5 వేల నుంచి 20 వేల వరకు డబ్బులు ఇస్తామని టీఆర్ఎస్  లీడర్లు చెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని చోట్ల ఓటర్లకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.  మరికొన్ని చోట్ల లోకల్​ లీడర్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. హైదరాబాద్​తోపాటు ఎన్నికలు జరిగే జిల్లా కేంద్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఓటర్లకు ఫారిన్ లిక్కర్​, విందులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఓటర్లను పోలింగ్​ కేంద్రానికి రప్పించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. 20 నుంచి 30 మంది ఓటర్ల కోసం ఏసీ బస్సులు, బస్సుల్లో రాలేమని తేల్చిచెప్పిన ఓటర్లకు ఇన్నోవా కార్లు ఏర్పాటు చేస్తున్నట్లు, వీరికి దారిలో నాన్ వెజ్, లిక్కర్ తో విందులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు టీఆర్​ఎస్​ లీడర్లు చర్చించుకుంటున్నారు. 

గద్వాలలో మొన్న స్వీట్​ బాక్సులు, నిన్న డబ్బులు
ఎట్లనైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్  లీడర్లు ప్రలోభాలకు తెరతీశారు. గద్వాల జిల్లావ్యాప్తంగా గ్రాడ్యుయేట్ల ఇండ్లలో కొద్దిరోజులుగా స్వీట్​బాక్సులు పంచుతున్న ఆ పార్టీ నేతలు శుక్రవారం ఏకంగా క్యాష్​ పంపిణీ చేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు... గద్వాల జిల్లాలోని పలు మండలాల్లో అధికారపార్టీ ఎంపీపీలు తమ ఆఫీసులకు ఎంపీటీసీలను, సర్పంచులను పిలిపించుకొని  గ్రామాల్లోని గ్రాడ్యుయేట్ల సంఖ్య ప్రకారం ఓటుకు రెండువేల చొప్పున అందజేసినట్లు తెలుస్తోంది. మల్లకల్ మండల కేంద్రంలోనైతే బాహాటంగా నోట్ల పంపిణీ జరిగింది.