కాళ్లు, చేతులు నరికే వాళ్లు  కావాలా..? అభివృద్ధి చేసే వాళ్లు కావాలా?

కాళ్లు, చేతులు నరికే వాళ్లు  కావాలా..? అభివృద్ధి చేసే వాళ్లు కావాలా?
  • ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి –వరంగల్ రోడ్ షోలో బండి సంజయ్
  • కేసీఆర్ కుటుంబం ప్రతి వ్యక్తి అకౌంట్లో 5 లక్షలు వేసేంత డబ్బును సంపాదించింది
  • 2023లో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం పక్కా –బండి సంజయ్

వరంగల్ అర్బన్: తమను ప్రశ్నిస్తే తల, కాళ్లు, చేతులు నరికే వాళ్లు కావాలా..? లేక అభివృద్ధి చేసే వాళ్లు కావాలా..? ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తలలు, కాళ్లు, చేతులు నరికేటోళ్లకు టికెట్లు ఇచ్చారని, తలలు నరికే పార్టీ కావాలా..? లేక  ఓరుగల్లును అభివృద్ధి చేసే పార్టీ కావాలా..? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ‘‘రాంపుర్ డంప్ యార్డ్ నుండి చెత్త చెదారం వచ్చి వడ్డేపల్లి చెరువులో చేరుతున్నాయి.. ఆ నీటినే తాగునీరుగా సరఫరా చేస్తున్నారు.. బీజేపీ కి అవకాశం ఇస్తే స్వచ్ఛమైన నీటిని అందిస్తాం.. రాంపుర్ డంప్ యార్డ్ ను తరలిస్తాం..’’ అని బండి సంజయ్ చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్ కోసం కోట్లు కేటాయిస్తున్నారని, కేసీఆర్ కుటుంబం మాత్రం అక్రమంగా దోచుకున్న డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి వ్యక్తి అకౌంట్లో 5 లక్షలు వేసేంత సొమ్ము కేసీఆర్ కుటుంబం సంపాదించిందని, 2023లోగా కేసీఆర్ కుటుంబం జైలు కు వెళ్లడం పక్కా.. అని బండి సంజయ్ పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధికి మేం నిధులు తెస్తున్నా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం దారి మల్లిస్తోందన్నారు. ఓరుగల్లు లో అభివృద్ధిలో కుంటుపడిందని, నిధులు ఇచ్చే  బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని.. ఓరుగల్లు ప్రజలు కులాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సమాజ శ్రేయస్సు కోసం పని చేసే పార్టీ బీజేపీ అని.. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు మోడీ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. కనీసం ఇక్కడి నాయకులు వాక్సిన్ వేసుకోమని చెప్పటం లేదని ఆరోపించిన ఆయన పేదలు పిట్టలు రాలినట్టు రాలుతుంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని విమర్శించారు. కోవిడ్ మీద ఇప్పటికే మోడీ 2 సార్లు రివ్యూ చేశారు.. సీఎం ఇంతవరకు సమీక్ష చేయనేలేదన్నారు. ఒక్కసారి ఓరుగల్లు బాధ్యత ను బీజేపీ చేతుల్లో పెట్టండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం అని బండి సంజయ్ చెప్పారు.