కాంగ్రెస్‌ కట్టిన ట్యాంకులకు రంగులేస్తున్న టీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ కట్టిన ట్యాంకులకు రంగులేస్తున్న టీఆర్‌ఎస్‌
  • భగీరథపై కేటీఆర్ వి అబద్ధాలు
  • రూ. 30 వేల కోట్ల ఖర్చు చేసి 10% ఇండ్లకూ నీళ్లవ్వలేదు
  • కమీషన్ల కోసమే ఈ పథకం తెచ్చారు
  • రైతు బంధును ఎలక్షన్ బంధుగా మార్చారు: ఉత్తమ్

దేవరకొండ పర్యటనలో మంత్రి కేటీఆర్  మిషన్​ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికీ ఇస్తున్నామంటూ అబద్ధపు ప్రచారం చేశారని పీసీసీ చీఫ్​, నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి  విమర్శించారు. మిషన్​ భగీరథ పథకానికి రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో 10 శాతం ఇండ్లకు కూడా నీళ్లు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసమే ఈ పథకాన్ని తెచ్చారని,  ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ ​ఆఫీసులో పార్టీ కౌన్సిలర్లను ఉత్తమ్​ అభినందించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ భగీరథ  నీళ్ల సంగతి అటుంచితే కాంగ్రెస్​ హయాంలో కట్టిన పాత ట్యాంకులకు కొత్త రంగులేస్తూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందని సర్కారును విమర్శించారు.

ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్​

‘‘మూడేండ్లకే మిషన్​ భగీరథ పథకం పూర్తి చేస్తామని, లేకపోతే ఎన్నికల్లో  ఓట్లు అడగబోమని చెప్పిన సీఎం కేసీఆర్​ ఆరేండ్లయినా ఆ పథకం పనులు అసంపూర్తిగానే మిగిల్చారు. దాని నుంచి ప్రజలను మభ్యపెట్టడానికి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటున్నారు” అని ఉత్తమ్​ ఎద్దేవా చేశారు. ఎన్నికల టైంలోనే రైతు బంధు పథకం డబ్బులను వేస్తూ దాన్ని ఎలక్షన్ బంధు పథకంగా మార్చారని దుయ్యబట్టారు. డబుల్​ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి అడ్రస్​ లేకుండాపోయాయని వ్యాఖ్యానించారు. మిర్యాలగూడ మున్సిపల్​ ఎన్నికల్లో పెద్ద ఎత్తున టీఆర్​ఎస్​ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్  సమావేశాల్లో ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లపై గళం విప్పుతామని చెప్పారు.