గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ గుబులు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ గుబులు
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లపై గులాబీల గుబులు
  • వరంగల్​ సీట్లో పల్లాకు బీ ఫామ్.. హైదరాబాద్ సీటుపై తర్జన భర్జన
  • ఇక్కడ పట్టు లేదని.. ఓడితే పరువు పోతుందని ఆందోళన

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లపై టీఆర్ఎస్ కిందా మీదా పడుతోంది. రెండు సీట్లలో పోటీ చేయాలా, ఒక్క దానికే పరిమితం కావాలా అన్నది తేల్చుకోలేకపోతోంది. రెండు చోట్లా ఓడిపోతే పరువు పోతుందని.. అందుకని కేవలం సిట్టింగ్ స్థానం వరంగల్–నల్గొండ–ఖమ్మంలో మాత్రమే పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. వరంగల్– నల్గొండ– ఖమ్మం, హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎలక్షన్లకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వరంగల్​సీటుకు సంబంధించి పల్లా రాజేశ్వర్ రెడ్డికి బుధవారం టీఆర్ఎస్​ బీఫామ్​ అందింది. ఇక రెండో సీటు విషయం తేలాల్సి ఉంది.

వెంటాడుతున్న ఓటమి భయం

హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్ నగర్  గ్రాడ్యుయేట్​ సీటు నుంచి పోటీపై టీఆర్ఎస్ పెద్దలు అనేక కోణాల్లో ఆరా తీస్తున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఓటములు పార్టీని వెంటాడుతున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతగా పట్టులేని హైదరాబాద్ గ్రాడ్యుయేట్​ సీటు నుంచి పోటీ చేయడం అవసరమా? అన్న అభిప్రాయం వినిపిస్తున్నట్టు చెబుతున్నారు.

రెండు చోట్లా ఓడితే పరువు) పోతుందని.. సిట్టింగ్​ సీటు అయిన వరంగల్​లో పోటీ చేస్తే సరిపోతుందని ఆలోచన చేస్తున్నట్టు చెప్తున్నారు. ‘‘రెండు చోట్లా మనం ఎందుకు పోటీ చేయాలి, వాటిలో ఒకటే మన సిట్టింగ్  సీటు. అక్కడే పోటీ చేద్దాం. మరోచోట పోటీ చేయకుంటే వచ్చే నష్టం ఏంటి?’’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించినట్టు ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన ఓ సీనియర్ లీడర్ చెప్పారు. మరోవైపు అధికార పార్టీగా ఉండి ఒకేచోట పోటీ చేస్తే పరువు పోతుందని, పార్టీ బలహీన పడ్డదన్న సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని హైదరాబాద్ కు చెందిన ఓ సీనియర్ టీఆర్ఎస్ లీడర్ అంటున్నారు.

పోటీకి ముందుకురాని లీడర్లు

హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ సీటు నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ లీడర్లు జంకుతున్నారు. గెలిచే అవకాశమే లేనప్పుడు పోటీ చేయడం వృథా అనే అభిప్రాయంలో ఉన్నారు. నిజానికి రెండు గ్రాడ్యుయేట్​ సీట్లలో పోటీ చేయాలన్న ఉద్దేశంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా లీడర్లతో మీటింగ్ జరిపారు. పెద్ద ఎత్తున ఓట్లు నమోదు చేయించాలని ఆదేశించారు. తీరా ఓటర్ నమోదు పూర్తయ్యాక.. అసలు పోటీ చేసే క్యాండిడేట్​ ఎవరన్న సమస్య మొదలైంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తోపాటు గతంలో పోటీచేసి ఓడిన దేవిప్రసాద్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులను పోటీ చేయాలని అడిగితే.. వారంతా నిరాకరించినట్టు ప్రచారం
జరుగుతోంది.

పల్లా రాజేశ్వర్​రెడ్డికి బీఫామ్

వరంగల్ – నల్గొండ – ఖమ్మం గ్రాడ్యుయేట్​ సీట్లో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్​ బుధవారం టీఆర్ఎస్​ బీఫామ్ అందించారు. ఫాంహౌజ్ లో ఉన్న కేసీఆర్.. పల్లా రాజేశ్వర్ రెడ్డిని అక్కడికి పిలిపించుకుని బీఫామ్ ఇచ్చారు. నామినేషన్లకు చివరి తేదీ అయిన ఈ నెల 23న ఉదయం 10 గంటలకు నల్గొండలో పల్లా నామినేషన్ వేయనున్నారు. ఆయన ఇప్పటికే ఎలక్షన్​ ప్రచారం
మొదలుపెట్టారు.