పార్టీ పేరు మార్పుపై పబ్లిక్‌‌ నోటీస్‌‌ జారీ చేసిన టీఆర్‌‌ఎస్‌‌

పార్టీ పేరు మార్పుపై పబ్లిక్‌‌ నోటీస్‌‌ జారీ చేసిన టీఆర్‌‌ఎస్‌‌
  • 30 రోజుల్లోగా అభ్యంతరాలు సీఈసీ దృష్టికి తీసుకురావాలే
  • అభ్యంతరాలు రాకుంటే డిసెంబర్‌‌ 17 తర్వాత పేరు మార్పు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ పేరును బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌గా మార్చడంపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఆ పార్టీ అధ్యక్షుడు జాతీయ దినపత్రికల్లో సోమవారం పబ్లిక్‌‌‌‌ నోటీస్‌‌‌‌ (ప్రకటన) ఇచ్చారు. హైదరాబాద్‌‌‌‌ కేంద్రంగా రిజిస్టర్ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌‌‌‌ రాష్ట్ర సమితిగా మార్చుతున్నామని ఈ విషయాన్ని దేశ ప్రజలందరి దృష్టికి తీసుకురావడానికే ఈ ప్రకటన జారీ చేశామని అందులో పేర్కొన్నారు. పేరు మార్పిడిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ప్రకటన వచ్చిన రోజు నుంచి 30 రోజుల్లోగా సెక్రటరీ (పొలిటికల్‌‌‌‌ పార్టీ), ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా, నిర్వచన్‌‌‌‌ సదన్‌‌‌‌, అశోకా రోడ్‌‌‌‌, న్యూఢిల్లీకి తెలియజేయాలని సూచించారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పేరును భారత్‌‌‌‌ రాష్ట్ర సమితిగా మార్చుతూ అక్టోబర్‌‌‌‌ 5న తెలంగాణ భవన్‌‌‌‌లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీతో పాటు తమ పార్టీ పేరు మార్పిడి ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుతూ సీఈసీకి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధ్యక్షుడు కేసీఆర్‌‌‌‌ రాసిన లేఖను ప్లానింగ్‌‌‌‌ బోర్డు వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌, పార్టీ జనరల్‌‌‌‌ సెక్రటరీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి అందజేశారు. పార్టీ పేరు మార్పుపై సీఈసీ నుంచి అనేక అంశాలపై క్లారిటీ కోరుతూ పలు లేఖలు రాయగా పార్టీ నుంచి వాటికి బదులిచ్చారు. వాటితో సంతృప్తి చెందిన సీఈసీ పార్టీ పేరు మార్పుపై ప్రజల నుంచి అభ్యంతరాలు కోరుతూ ప్రకటన జారీ చేయడానికి అనుమతినిచ్చింది. ఈ క్రమంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పేరు మార్పిడిపై ప్రకటన ఇచ్చారు.

అభ్యంతరాల్లేకుంటే 10 రోజుల్లో..

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌‌‌‌ రాష్ట్ర సమితిగా మార్చుతున్నామని, ఇప్పుడు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఉన్న కారు గుర్తు, గులాబీ కలర్‌‌‌‌ జెండా, పార్టీ ఆస్తులను పేరు మారే బీఆర్‌‌‌‌ఎస్​కు బదలాయించాలని కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. భారత్‌‌‌‌ రాష్ట్ర సమితి అనే అర్థం వచ్చేలా ఇప్పటికే ఏదైనా రాష్ట్రంలో పార్టీ ఉన్నా, ఏదైనా భాషలోకి ట్రాన్స్‌‌‌‌లేట్‌‌‌‌ చేసినపుడు అలాంటి అర్థం స్ఫురించినా దానిపై అభ్యంతరాలు తెలిపే అధికారం సంబంధిత పార్టీకి ఉంటుంది. ఈ అభ్యంతరాలను నిర్దేశిత గడువులోగా సీఈసీకి సమర్పిస్తే వాటిని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌ దృష్టికి తీసుకువచ్చి అవసరమైన చేర్పులు, మార్పులపై సూచనలు చేస్తుంది. ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే నిర్దేశిత వ్యవధి ముగిసిన 10 రోజుల తర్వాత (డిసెంబర్‌‌‌‌ 17 తర్వాత) టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పేరును బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌గా మార్చుతూ పార్టీ వర్గాలకు సీఈసీ లేఖ అందజేస్తుంది. ఆ వెంటనే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్లమెంటరీ పక్షం, శాసనసభ పక్షం పేర్లను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్లమెంటరీ పార్టీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎల్పీగా పార్లమెంటరీ, అసెంబ్లీ సెక్రటేరియట్‌‌‌‌లు బులెటిన్‌‌‌‌ జారీ చేయాల్సి ఉంటుంది. దీంతో పార్టీ పేరు మార్పుతో పాటు పార్లమెంటరీ, శాసనసభాపక్షం పేర్ల మార్పు ప్రక్రియ పూర్తవుతుంది.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పేరుతో మూడు పార్టీలు

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద మూడు పార్టీలు రిజిస్టర్​ అయ్యాయి. బహుజన్‌‌‌‌ రాష్ట్ర సమితి (సికింద్రాబాద్‌‌‌‌), బహుజన్‌‌‌‌ రిపబ్లికన్‌‌‌‌ సోషలిస్ట్‌‌‌‌ పార్టీ (ముంబై), భారతీయ రాష్ట్ర సమతవాదీ పార్టీ (జైపూర్‌‌‌‌)లు ఇప్పటికే రిజిస్టర్​ అయ్యాయి. భారత్‌‌‌‌ రాష్ట్ర సమితిని ఇతర భాషల్లోకి ట్రాన్స్‌‌‌‌లేట్‌‌‌‌ చేసినప్పుడు ఈ మూడు పార్టీల పేర్ల అర్థం రాదని, అలాంటప్పుడు ఆయా పార్టీలు అభ్యంతరం తెలుపకపోవచ్చని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు చెప్తున్నారు. జైపూర్‌‌‌‌ కేంద్రంగా రిజిస్టర్​ అయిన భారతీయ రాష్ట్ర సమతావాదీ పార్టీ ఏదైనా అభ్యంతరం చెప్పవచ్చని అనుమానిస్తున్నారు. ఒకవేళ ఆ పార్టీ లేదా, ఇంకెవరైనా అబ్జక్షన్‌‌‌‌ చెప్తే పార్టీ పేరు మార్పు మరింత ఆలస్యమయ్యే అవకాశముందని చెప్తున్నారు. పార్టీ పేరు మార్పునకు సీఈసీ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇస్తే గుజరాత్‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే భీవండి ప్రాంతంలో పోటీ చేయాలని కేసీఆర్‌‌‌‌ భావించారు. పార్టీ పేరు మార్పు ప్రక్రియ మరింత లేట్‌‌‌‌ అవుతుండటంతో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.